Tuesday, November 19, 2024

JNU వీసీగా తెలుగు మహిళ శాంతిశ్రీ

న్యూఢిల్లీ జవాహర్‌ లాల్‌ నెహ్రూ యూనిర్సిటీ వీసీగా తెలుగు కుటుంబంలో పుట్టిన శాంతిశ్రీ ధూళిపూడి పండిత్‌ నియమితులయ్యారు. నల్లగొండ మూలాలున్న మామిడాల జగదీశ్‌ కుమార్‌ యూజీసీ చైర్మన్‌గా వెళ్లడంతో మరో తెలుగు మూలాలున్న ప్రొఫెసర్‌ కు జేఎన్యూ వీసీ అయ్యే అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.

జగదీశ్‌ కుమార్‌ మాదిరిగానే హిందూ జాతీయవాది అయిన శాంతిశ్రీ తల్లిదండ్రులు పూర్వపు సోవియెట్‌ యూనియన్‌లో పనిచేస్తున్న కారణంగా లెనిన్‌గ్రాడ్‌ (సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌గా మారింది)లో 1962లో ఆమె జన్మించారు. తండ్రి ధూళిపూడి ఆంజనేయులు సివిల్‌ సర్వెంట్, రచయిత, జర్నలిస్టు. ఆయనది గుంటూరు జిల్లా. ఆమె తల్లి మూలమూడి ఆదిలక్ష్మి తన భర్త సోవియోట్‌ రష్యాలో భారత అధికారిగా పనిచేస్తున్న కారణంగా లెనిన్‌గ్రాడ్‌ ఓరియంటల్‌ ఫాకల్టీ డిపార్ట్‌మెంట్‌లో తమిళ, తెలుగు ప్రొఫెసర్‌గా ఉన్నారు. పుట్టింది పూర్వపు కమ్యూనిస్ట్‌ దేశంలోనైనా మద్రాసులో స్కూలు చదువుల నుంచి ఎంఏ వరకూ పూర్తిచేసిన ఈ తెలుగు మహిళ శాంతిశ్రీ ప్రస్తుతం పుణె సావిత్రీబాయి వర్సిటీ ప్రొఫెసర్‌.

ఆమె గత కొన్నేళ్లుగా చేసిన ట్వీట్లను చూస్తే హిందువలంతా బంధువలనీ, ఇండియాలో హిందూ మహిళలకు లవ్‌ జిహాద్‌ వల్ల ప్రమాదముందనే భావనతో ఉన్నారనిపిస్తోంది. 2020 నవంబర్‌ లో చేసిన ఓ ట్వీట్‌లో– హిందువులు అనే మాట వాడకుండా ముస్లిమేతరులు లవ్‌ జిహాదీల పట్ల అప్రమత్తంగా ఉండాలని శాంతిశ్రీ హెచ్చరించారు.

మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఎంఏ పూర్తి చేసి తాను ఇప్పుడు వీసీ అయిన జేఎన్యూలోనే ఆమె పీఎచ్‌డీ చేశారు. రెండో ఇంటిపేరు–పండిత్‌ అనే మాటను బట్టి చూస్తే శాంతిశ్రీ భర్త మహరాష్ట్రియన్‌ బ్రాహ్మణుడని అర్ధమవుతోంది. చాలాకాలంగా భారత మహిళలు కూడా పాశ్చాత్య క్రైస్తవ, ముస్లిం స్త్రీల మాదిరిగా తమ పుట్టింటి పేరుకు భర్త కుటుంబనామం జోడించడం అలవాటుగా మారిందనడానికి మన తెలుగు ఆడబిడ్డ డాక్టర్‌ శాంతిశ్రీ చక్కటి ఉదాహరణ. లెనిన్‌గ్రాడ్‌లో పుట్టి, మద్రాసులో చదువుతూ పెరిగి, దిల్లీలో పీఎచ్‌డీ చేసిన ఆమె గోవా, పుణెలో పనిచేసి చివరికి లక్ష్యం సాధించారు. ప్రస్తుతం ఆమె పుణె వర్సిటీ ఉపకులపతి. గతంలో కాంగ్రెస్‌ హయాంలో, ఇంకా జనతా, నేషనల్, యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాలు, యూపీఏ సర్కార్ల పాలనలతో ఎర్ర లేదా లెఫ్ట్‌ ముసుగు లేదా రెడ్‌ ఇన్నర్‌ వేర్‌ కనిపించేలా వేసుకుని తిరిగేవాళ్లు ‘కాస్త కష్టపడితే’ కేంద్రీయ ఉన్నత విద్యాసంస్థల్లో వైస్‌ చాన్సలర్, డైరెక్టర్, చైర్మన్‌ వంటి అకడమిక్‌ పదవులు దక్కేవి. ఇప్పుడు నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా చక్కగా కాంగ్రెస్, ఇతర ‘ప్రగతిశీల’ ప్రభుత్వాల బాటన నడుస్తూ కాషాయ భావాలున్న తనవారికి పదవులు కట్టబెడుతోంది. ‘డబల్‌ బారెల్డ్‌’ ఇంటి పేర్లతో దిల్లీ వెళుతున్న తెలుగు మహిళ జేఎన్యూకు కాషాయ రంగు ఎంత వరకూ వేయగలరో 2024 కల్లా తేలిపోతుంది. ప్రఖ్యాత జే ఎన్ యూ వీసీ పదవిని ఓకే భావజాలం, భాష, సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి వరుసగా ఇవ్వడం ఇదివరికెన్నడూ లేని కొత్త ఆనవాయితీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement