Friday, November 22, 2024

పులుల రక్షణలకు గ్రీన్‌ చాలెంజ్‌ సంతోష్ కుమార్ అండ

హైదరాబాద్ – అడవుల రక్షణ, పులుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 1973లో ప్రాజెక్టు టైగర్‌ను ప్రవేశ పెట్టింది. శనివారంతో ఈ సేవ్‌టైగర్‌ ఉద్యమానికి 50 ఏండ్లు నిండాయి. దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌ టైగర్‌ కింద తీసుకున్న చర్యల వల్ల పులుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 1973లో 1,827గా నమోదైన పులుల సంఖ్య 2022 నాటికి 2,967కు చేరింది. టైగర్‌ రిజర్వుల సంఖ్య 9 నుంచి 53కు పెరిగింది. ప్రాజెక్ట్‌ టైగర్‌ ప్రాధాన్యం, అడవులు, పర్యావరణంపై పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా పంచుకొన్నారు. సేవ్‌ టైగర్‌ ఉద్యమం గోల్డెన్‌ జూబ్లీ సందర్భంగా తెలంగాణకు చెందిన అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు విడుదల చేసిన టైగర్‌ బుక్‌, టీషర్ట్‌, కాఫీ మగ్‌, సావనీర్లను ఎంపీ సంతోష్‌ ప్రదర్శించారు..

తెలంగాణ ప్రభుత్వం, అటవీశాఖ ద్వారా అమ్రాబాద్‌, కవ్వాల్‌ పులుల అభయారణ్యాన్ని చాలా బాగా నిర్వహిస్తున్నదని, పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని ఎంపీ సంతోష్‌ అన్నారు. గ్రీన్‌ చాలెంజ్‌ తరఫున దేశవ్యాప్తంగా పచ్చదనం పెంపు, పర్యావరణ రక్షణపై అవగాహనకు కృషి చేస్తున్నామని, పులుల రక్షణకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. పర్యావరణ సమతుల్యతలో పెద్దపులి అగ్రభాగాన ఉంటుందని, ఈ అమోఘమైన జంతువును కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని పిలుపునిచ్చారు

Advertisement

తాజా వార్తలు

Advertisement