Friday, November 22, 2024

Railway: సంక్రాంతి ఎఫెక్ట్.. రైల్వే ప్రయాణికులకు షాక్.. ప్లాట్ ఫాం ధర డబుల్..

సంక్రాంతి పండగ వేళ ప్రయాణికులకు రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ.10 నుంచి రూ.20కి పెంచేసింది. కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని రైల్వే స్టేషన్‌లో రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది. సంక్రాంతి పండగ కారణంగా రైల్వే స్టేషన్‌లో రద్దీ విపరీతంగా పెరిగిందని సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది. ప్రయాణికులకు తోడు.. వారి వెంట వచ్చేవారితో స్టేషన్ నిత్యం రద్దీగా ఉంటోందని, అందుకని ప్లాట్‌ఫామ్ టికెట్ ధర పెంచినందునా రద్దీని కొంతమేరకు నియంత్రించవచ్చునని రైల్వే శాఖ భావిస్తోంది.

సాధారణంగా పండుగల సమయంలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో రద్దీ కామన్. ముఖ్యంగా సంక్రాంతి, దసరా పండగల టైమ్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతుంటాయి. నగరాలు, పట్టణాల నుంచి చాలా కుటుంబాలు పల్లె బాట పడుతాయి. పండుగ సమయంలో ఎంత రద్దీ ఉంటుందో.. పండుగ ముగిశాక కూడా అంతే రద్దీ ఉంటుంది. ఎందుకంటే జనం మళ్లీ సిటీ బాట పట్టే సమయంలోనూ ఈ పరిస్థితి రిపీట్ అవుతుంటుంది. గతేడాది కరోనా సెకండ్ వేవ్ సమయంలో రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను ఏకంగా రూ.50కి పెంచిన సంగతి తెలిసిందే. కరోనా పీక్స్‌కి చేరడంతో రైల్వే స్టేషన్లలో రద్దీ నియంత్రణకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాక టికెట్ ధరను తగ్గించనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement