అండమాన్ నికోబార్ దీవుల్లో సంకల్ప్ స్మారక చిహ్నాన్ని ఆ ద్వీపం కమాండర్ ఇన్ చీఫ్ ఆవిష్కరించారు. ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను, ఆయన నిష్ట, కర్తవ్యం, బలిదానాన్ని, ఇండియన్ నేషనల్ ఆర్మీ, సైనికుల త్యాగాలను గుర్తు చేసే స్మారక చిహ్నంగా నిర్మించారు. 1941లో నేతాజీ బ్రిటిషర్ల కళ్లుగప్పి తప్పించుకొని బయటకు వెళ్లి తర్వాత మూడేళ్లకు మళ్లీ 1943లో డిసెంబర్ 29న పోర్ట్ బ్లయర్‌లో అడుగుపెట్టారు. 1943 కల్లా ఇండియన్ నేషనల్ ఆర్మీ భారత గడ్డపై అడుగుపెడుతుందని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఆఫ్ ఆజాద్ హింద్ (ఆర్జి హుకుమత్ ఈ ఆజాద్ హింద్) అధిపతిగా, ఇండియన్ నేషనల్ ఆర్మీ సుప్రీం కమాండర్‌గా ఆయన అండమాన్ ద్వీపంలో అడుగుపెట్టారు. అండమాన్, నికోబార్‌ను ఇండియా తొలి స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించారు. పోర్ట్ బ్లయర్‌లో 1943 డిసెంబర్ 30న తొలిసారి భారత గడ్డపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అండమాన్ ద్వీపానికి షహీద్ అని, నికోబార్‌కు స్వరాజ్ అని పేరు పెట్టారు.