యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజా చత్రం సమ్మతమే..ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో గోపినాథ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.
కథ ఏంటంటే- చిన్న వయసులోనే అమ్మను పోగొట్టుకున్న కిరణ్ అబ్బవరం .. తన ఇంట్లో మళ్ళీ వెలుగులు నిండాలంటే మహాలక్ష్మి లాంటి భార్య తన జీవితంలోకి రావాలని కలలు కంటుంటాడు. చిన్నప్పటి నుంచే పెళ్లి మీద ఇష్టం పెంచుకున్న కృష్ణ.. తండ్రి సూచనతో బాగా చదువుకొని, ఉద్యోగంలో చేరిన వెంటనే పెళ్ళికి సిద్ధమవుతాడు. అయితే తాను పెళ్లి చేసుకున్నాకే ప్రేమిస్తానని, అలాగే తనకు కాబోయే భార్యకు కూడా తనే ఫస్ట్ లవ్ అవ్వాలని అనుకుంటాడు. అలాగే తనకు కాబోయే భార్య అసలు అబద్ధాలు ఆడకూడదు, అన్ని విషయాల్లో చాలా పద్ధతిగా ఉండాలంటూ ఏవేవో గొప్పగా ఊహించుకుంటాడు. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది అన్నట్లుగా.. తనకు తెలియకుండానే తాను ఊహించుకున్న దానికి పూర్తి భిన్నమైన శాన్వి(చాందిని చౌదరి) ప్రేమలో పడతాడు. శాన్వి చాలా మోడరన్ గా ఉంటుంది. సిగరెట్, మందు లాంటి అలవాట్లు ఉన్నాయి. అబద్దాలు కూడా ఆడుతుంది. మరి అలాంటి శాన్వితో కృష్ణ ప్రేమలో ఎలా పడ్డాడు? శాన్వి కోసం తను మారిపోయాడా లేక శాన్వినే తనకు నచ్చినట్లు మార్చుకున్నాడా? అసలు రెండు భిన్న మనస్తత్వాలున్న వీరిద్దరూ ఒక్కటయ్యారా? అనేదే ఈసినిమా కథ..
విశ్లేషణ – మన ఇష్టాలను వేరే వారి మీద రుద్దుతూ, మనకి నచ్చినట్లు వాళ్ళని బ్రతకమంటూ.. వాళ్ళ లైఫ్ ని కూడా మనమే బ్రతికేయాలి అనుకోకూడదు. ఇది ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్. నిజానికి డైరెక్టర్ అనుకున్న పాయింట్ బాగుంది. అందుకు తగ్గట్లు హీరో, హీరోయిన్ పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగుంది. కానీ సెకండాఫ్ లోనే కాస్త తడబాటు కనిపించింది. ఫస్టాఫ్ నడిపించిన విధానం బాగుంది. చిన్నప్పుడు తల్లితో కృష్ణ బాండింగ్, తల్లి దూరమయ్యాక పెళ్లే తన గోల్ గా మారడం, పెద్దయ్యాక శాన్వితో పరిచయం.. ఇలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా సాగిపోయింది.
టెక్నీషియన్స్ – సతీష్ రెడ్డి మాసం కెమెరా పనితనం బాగుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ పర్లేదు. సాంగ్స్ వింటున్నప్పుడు బానే ఉన్నాయి కానీ హమ్ చేసుకునేలా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు తగ్గట్లు ఉంది. ఎడిటర్ విప్లవ్ సెకండాఫ్ లో మరింత కోత పెట్టాల్సింది.
నటీనటుల పనితీరు – పక్కింటి కుర్రాడి తరహా పాత్రలు చేస్తూ అలరిస్తున్న కిరణ్ అబ్బవరం మరోసారి అలాంటి పాత్రలోనే నటించాడు. తన సహజ నటనతో మళ్ళీ మెప్పించాడు. తను ప్రేమించింది.. చిన్నప్పటి నుంచి తను ఊహించుకున్న అమ్మాయి కాదని తెలిసి.. తనను మార్చుకునే క్రమంలో కిరణ్ కనబరిచిన నటన ఆకట్టుకుంది. ఇక ఇందులో చాందినికి నటనకు స్కోప్ ఉన్న మంచి పాత్ర దక్కింది. ఒక వైపు తనకు నచ్చినట్లు బ్రతుకుతూ, మరోవైపు తనకు నచ్చిన వాళ్ళని బాధపెట్టకూడదు అనుకునే అమ్మాయి పాత్రలో చాందిని ఒదిగిపోయింది. సినిమాలో వీరిద్దరి పాత్రలే కీలకం. సినిమా అంతా ఈ రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.