Saturday, November 23, 2024

శాకుంత‌లం రివ్యూ.. స‌మంత మెప్పించిందా..!

స్టార్ హీరోయిన్ స‌మంత న‌టించిన చిత్రం శాకుంత‌లం. ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఈ చిత్రాన్ని ప్రేమ‌క‌థా దృశ్య‌కావ్యంగా తెర‌కెక్కించాడు.ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.మ‌రి ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

క‌థ ఏంటంటే.. విశ్వామిత్రుని తపస్సుని భగ్నం చేయడానికి మేనక (మధుబాల)ను భూలోకానికి పంపించగా.. మేనక తన బాధ్యతను నిర్వర్తించే క్రమంలో విశ్వామిత్రుడితో ఒక్కటై బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తర్వాత ఆ బిడ్డను భూమి మీదే వదిలేసి స్వర్గానికి వెళ్లిపోతుంది. ఆ బిడ్డను చేరదీసి పెంచి పెద్ద చేస్తాడు కణ్వ మహర్షి (సచిన్ ఖేద్కర్). ఆ చిన్నారే శకుంతల (సమంత). కణ్వ మహర్షి ఆశ్రమంలో అల్లారు ముద్దుగా పెరిగి పెద్దయిన శకుంతల.. యుక్త వయసు వచ్చాక.. తన ఆశ్రమానికి వచ్చిన దుష్యంత మహారాజు (దేవ్ మోహన్)తో ప్రేమలో పడి.. అతణ్ని గాంధర్వ వివాహం చేసుకుంటుంది. తాను రాజ్యానికి వెళ్లి తిరిగి తనను రాజ లాంఛనాలతో తీసుకెళ్తానని చెప్పి వెళ్తాడు దుష్యంతుడు. కానీ అతను ఎంతకీ తిరిగిరాడు. ఈ లోపు శకుంతల గర్భవతి అవుతుంది. నిండు చూలాలిగా దుష్యంతుడి రాజ్యానికి వెళ్లి తనను స్వీకరించాలని కోరగా.. దుష్యంతుడు ఆమె ఎవరో తెలియనట్లు వ్యవహరిస్తాడు.. అందుకు కారణమేంటి.. దుష్యంతుడి ఆ స్పందన తర్వాత శకుంతల పరిస్థితి ఏమిటి.. చివరికి ఆమె భర్తతో ఒక్కటైందా లేదా అన్నది మిగతా కథ.

విశ్లేషణ.. చరిత్రలో గొప్ప కథగా పేరున్న కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంను ఒక దృశ్యకావ్యంలా తీర్చిదిద్దాలన్న ద‌ర్శ‌కుడు గుణశేఖర్ అండ్ టీం ప్లాన్ బెడిసికొట్టింది. ఈ సినిమాలో భారీతనానికి లోటు లేకపోయినా.. ఏదో ఒక కృత్రిమ వాతావరణంలోకి వెళ్లిన భావన కలగడం.. నాటకీయత శ్రుతి మించినట్లు అనిపించడం శాకుంతలంకు అతి పెద్ద ప్రతికూలతలు. ఈ కథ తెలిసిన వారికి అది చదువుతున్నపుడు కలిగే ఫీలింగ్ తెరపై చూస్తున్నపుడు కలగదు. ఇక ఈ కథ తెలియని వారికి.. సినిమా చూశాక ఏముంది ఇందులో అనే భావన కలుగుతుంది. జానపద.. చారిత్రక నేపథ్యంలో ఒక కల్పిత కథ అంటే దర్శకుడి ఊహలకు హద్దులేమీ ఉండవు. తెరపై ఏం చూపించినా.. ఎన్ని విన్యాసాలు చేసినా చెల్లిపోతుంది. కానీ వాస్తవ కథను చూపిస్తున్నపుడు చాలా పరిమితులు ఉంటాయి. భారీతనంతో సొబగులు అద్దగలరు. అదనపు హంగులు జోడించగలరు. కానీ ఉన్న కథను దాటి ఏం చేయడానికి వీల్లేదు. ఆల్రెడీ కథ తెలుసుకుని థియేటర్లలో అడుగు పెట్టిన ప్రేక్షకులను అబ్బురపరచాలంటే కథనం అద్భుతంగా అనిపించాలి. సన్నివేశాలు చూస్తుంటే.. అబ్బా ఏం తీశాడురా అనిపించాలి. కానీ శాకుంతలం సినిమా మొత్తంలో వావ్ ఫీలింగ్ కలిగించే ఒక్క ఎపిసోడ్… సన్నివేశం కూడా సినిమాలో లేదు.

- Advertisement -

నటీనటుల న‌ట‌న.. శకుంతల పాత్రకు న‌టి సమంత యాప్ట్ అనిపించలేదు. ఈ పాత్రలో ముగ్ధమనోహరమైన అందంతో.. నిండైన విగ్రహంతో కట్టిపడేసే కథానాయిక ఉండాల్సింది. మేకప్ తో ఎంత మేనేజ్ చేయాలని చూసినా.. ఆ పాత్రకు సమంత న‌ప్ప‌లేద‌నిపిస్తోంది. నటన పరంగా సమంతకు కొన్ని సన్నివేశాల్లో మంచి మార్కులే పడినా.. స్క్రీన్ ప్రెజెన్స్ దగ్గర మాత్రం కొంచెం తేడాగానే అనిపిస్తుంది. దీనికి తోడు ఆమె సొంతంగా చెప్పుకున్న డబ్బింగ్ కూడా కుదరలేదు. గ్రాంథిక టచ్ ఉన్న డైలాగులను సమంత సరిగ్గా పలకలేకపోయింది. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ మెప్పించాడు. అతను అందంగా ఉన్నాడు. చక్రవర్తి పాత్రకు సూటయ్యాడు. కానీ దేవ్ మనకు పరిచయం లేకపోవడం ప్రతికూలం అయింది. ఇలాంటి పాత్రల్లో తెలిసిన.. మాస్ ఇమేజ్ ఉన్న నటుడైతే బాగుండేది. కణ్వ మహర్షి పాత్రలో సచిన్ ఖేద్కర్.. దుర్వాసుడిగా మోహన్ బాబు తమ అనుభవాన్ని చూపించారు. చక్కగా నటించారు. అదితి బాలన్.. అనన్య నాగళ్ళ.. గౌతమి తమ పాత్రలకు న్యాయం చేశారు. శివ బాలాజీ.. కబీర్ సింగ్ దుల్హన్.. మధుబాల.. మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతికత‌..ఇలాంటి సినిమాలకు మణిశర్మ సరైన ఎంపికే కావచ్చు కానీ.. ఆయన శాకుంతలంకు ఆశించిన స్థాయిలో న్యాయం చేయలేకపోయాడు. పాటలు ఏదో వచ్చాయి వెళ్లాయి అన్నట్లున్నాయే తప్ప.. ఏదీ వినసొంపుగా అనిపించలేదు. పాటలకు మంచి స్కోప్ ఉన్న సినిమానే అయినా.. మణిశర్మ న్యాయం చేయలేకపోయాడు. ప్రణయ గీతాల్ని కూడా మామూలుగా లాగించేశాడు. నేపథ్య సంగీతం ఓకే. శేఖర్ వి.జోసెఫ్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమాలో భారీతనం కనిపిస్తుంది. బాగానే ఖర్చు పెట్టారు. గ్రాఫిక్స్ అక్కడక్కడా కాస్త కృత్రిమంగా అనిపించినా.. పరిమిత బడ్జెట్ లో బాగానే చేశారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు బాగున్నాయి. ఈ రోజుల్లో శాకుంతలం కథను ఇంత భారీతనంతో చెప్పాలన్న గుణశేఖర్ ప్రయత్నం అభినందనీయమే. కానీ ఆ కథను తెరపై అబ్బురపరిచేలా చూపించలేకపోయాడ‌నే టాక్ వినిపిస్తోంది. మొత్తానికైతే ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఏ మేర‌కు ఆద‌రిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement