Wednesday, November 20, 2024

మాల్‌ ప్రాక్టీస్‌ పై చర్యలు తీసుకోవద్దా?: టీడీపీపై సజ్జల ఫైర్

పేపర్ లీకేజీ విష‌యంలో ఎవ‌రు త‌ప్పు చేసినా, వారిని వ‌దిలేది లేద‌ని ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి స్ప‌ష్టం చేశారు. పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారంలో నారాయ‌ణ అరెస్ట్ వ్య‌వ‌హారంపై టీడీపీ చేస్తున్న ప్ర‌చారాన్ని ఆయ‌న ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయ‌ణ విష‌యంలో క‌క్ష‌సాధింపుల‌కు దిగుతున్నామంటూ త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నార‌ని సజ్జల మండిపడ్డారు. ఓ విప్ల‌వ‌కారుడు అరెస్టైన‌ట్లు చంద్ర‌బాబు హ‌డావుడి చేస్తున్నారంటూ తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడి మళ్లీ ఎదురుదాడికి దిగుతున్నారని.. తప్పు చేసింది ఎవరైనా వదిలేది లేదని సజ్జల హెచ్చరించారు.

మాల్ ప్రాక్టీస్ గానీ, పేప‌ర్ లీకేజీ త‌ప్పే కాద‌ని టీడీపీ నేరుగా చెప్ప‌గ‌ల‌దా? అంటూ స‌జ్జ‌ల సూటిగా ప్ర‌శ్నించారు. మాల్ ప్రాక్టీస్‌కు ఎగ‌బ‌డి, మ‌ళ్లీ త‌మ‌పైనే ఎదురుదాడి చేస్తున్నారని తీవ్రంగా మండిప‌డ్డారు. ప‌దో త‌ర‌గ‌తి పేప‌ర్ లీకేజీ విష‌యంలో ప్ర‌భుత్వం స‌రిగ్గా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని టీడీపీ ఆరోప‌ణ‌లు చేసింద‌ని, తాము చ‌ర్య‌లు తీసుకుంటే మాత్రం నానా హంగామా చేస్తోంద‌ని ధ్వజమెత్తారు. 100 శాతం ఉత్తీర్ణ‌త కోస‌మే కొన్ని సంస్థ‌లు మాల్ ప్రాక్టీసింగ్‌, పేప‌ర్ లీకేజీ వంటి అక్ర‌మాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇందులో భాగంగానే నారాయ‌ణ అరెస్ట్ అయ్యార‌ని స‌జ్జ‌ల తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే చర్యలు తీసుకోవద్దా? అని ప్రశ్నించారు. ఓ మాఫియాలా ఏర్పడి ​మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. వంద శాతం ఉత్తీర్ణత కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. తప్పు జరిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందని సజ్జల వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement