-గత ప్రభుత్వాల పోకడలతో భీమసింగి ‘షుగర్స్’నిర్వీర్యం..
-ప్రస్తుత వైసీపీ సర్కార్ కూడా అదే పంథాలో పయనిస్తున్న వైనం..
-చక్కెర చేదే సుమీ అని నమ్మబలికించే పనిలో సర్కార్ పెద్దలు..
విజయనగరం-ప్రభ న్యూస్ బ్యూరో : సహకారం రంగంపైపాలకులకు మమకారం కొరవడడంతో జిల్లాలోని భీమసింగి షుగర్స్‌గా పేరొందిన శ్రీవిజయరామ గజపతి కో-ఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్., దాదాపుగా నిర్వీర్యమైన పరిస్థితి స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో వున్నా సహకారం రంగం పట్ల చిన్నచూపు చూడడం పరిపాటిగా మారండంతో చక్కెర కర్మాగారాలన్నీ మూసివేతకు గురవుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖ జిల్లాలో తాండవ, ఏటికొప్పాక, చోడవరం కర్మాగారాలు మూతపడగా తాజాగా విజయనగరం జిల్లాలోని భీమసింగి షుగర్స్‌కు కూడా అదే గతి పడుతున్న దుస్థితి. 1960వ సంవత్సరంలో రిజిష్టర్ చేయబడిన ఈ కంపెనీ 1876-77 సీజన్ నుంచి చెరకు క్రషింగ్(గానుగ ఆడడం) మొదలు పెట్టిన వైనం తెలిసిందే. ఆ నాటి నుంచి చూసుకుంటే మొత్తం 43 సీజన్లు గానుగ ఆడిన చరిత్ర భీమసింగి షుగర్స్ది. 2003-04 సీజన్లో మాత్రం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం గానుగ ఆడకుండా నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. అయితే, 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2004-05 సీజన్‌కు గానుగ ఆటను మొదలెట్టించి నిరాటంకంగా కొనసాగించగా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు 2018-19 వరకు అనివార్యంగా గానుగ ఆటను కొనసాగించాయి. అయితే, మొత్తంగా 43 సీజన్లలో లావాదేవీలను పరిశీలిస్తే కేవలం 12 సీజన్లలో మాత్రమే లాభాల బాటలో పయనించగా మిగతా
31 సీజన్లలో నష్టాలు చవిచూసినట్లు అధికారిక నివేదికలు చాటిచెబుతున్న పరిస్థితి.
కాగా, ప్రతీ సీజన్లో నష్టం ఎందుకు వస్తుందో తెలుసుకునే ప్రయత్నాలు దాదాపుగా అన్ని పార్టీల ప్రభుత్వాల నుంచి కొరవడడం ఈరోజు భీమసింగి షుగర్స్ వంటి చెక్కెర కర్మాగారాలు మూసివేత దిశగా పయనించాయన్నది సుస్పష్టం. భీమసింగి షుగర్స్ ఆధునిక యంత్ర పరికరాల కోసం తహతహలాడినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఆ మొరను ఆలకించిన సందర్భం లేకపోయింది. ఫలితంగా ప్రతి ఏటా కర్మాగారం నిర్వహణ పేరిట రూ.6 నుంచి 7 కోట్లు (దుర్)వినియోగమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. అదంతా ఒక ఎత్తయితే..అధిక దిగుబడి వచ్చే విత్తనాలు ఇచ్చేందుకు కర్మాగారం నిర్వాహకులు ఏ రోజూ ప్రయత్నించలేదన్నది చెరకు రైతులు బాహాటంగానే చెబుతోన్న పరిస్థితి. గిట్టుబాటు ధరనిస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వ పెద్దలే ఆ ధర చెరకు రైతులకు గిట్టుబాటవ్వడం లేదని, ఫలితంగా ఏటా చెరకు సాగు గణనీయంగా తగ్గిపోతోందని చెప్పుకొస్తున్నారు. ఈనేపథ్యం అందుబాటులో వున్న పరిశ్రమలు మూతపడేందుకు దోహదపడుతోంది. అంటే కొత్త పరిశ్రమలు ఎటూ లేకపోగా అందుబాటులో వున్న పాత పరిశ్రమలకు మంగళం పాడేయడం ప్రభుత్వాల లక్ష్యమని పరోక్షంగా చెప్పినట్లయింది. 90 వేల మెట్రిక్ టన్నుల చెరకు వుంటేనే గానుగ ఆడడం కుదురుతుందన్న చందంగా తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పిన మాటలను ఇటు చెరకు రైతులు అటు కర్మాగారం సిబ్బంది కొట్టి పారేస్తున్నారు. నిజంగా అంత చెరకు గానుగ ఆడే సామర్థ్యం భీమసింగి షుగర్స్‌కు ఇపుడు లేనేలేదని తేల్చి చెబుతున్నారు.
భీమసింగి షుగర్స్‌ను మూసేద్దామన్న దురాలోచన నుంచి బయటకొచ్చి జీవం పోద్దామని ప్రభుత్వ పెద్దలు యోచించాల్సిందిగా పలువురు కోరుతున్నారు. భీమసింగి షుగర్స్ పరిధిలో సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల చెరకు వుందని సీజన్‌ను గట్టెక్కించేందుకు ఆ పరిమాణం సరిపోతుందన్నది నిపుణుల అంచనా. మరోవైపు ఎన్సీఎస్ షుగర్స్ పరిధిలోని 80 వేల మెట్రిక్ టన్నుల చెరకును సంకిలికి కాకుండా భీమసింగి షుగర్స్‌కు తోలించి గానుగ ఆడిస్తే అమాత్యులు చెబుతున్నట్లు లక్ష మెట్రిక్ టన్నుల లక్ష్యం కూడా నెరవేరుతుంది కదా అని అధిక సంఖ్యాకులు వాదిస్తున్నారు. అయితే, దురదృష్టవశాత్తు క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉన్నందున భీమసింగి షుగర్స్ వంటి మరెన్నో కర్మాగారాలు మూతపడతాయి తప్ప పునరుజ్జీవం సాధించలేవని కుండబద్దలుకొడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే జ్యూట్ పరిశ్రమలు మూతపడగా తాజాగా భీమసింగి షుగర్స్‌ను వాటి సరసన చేర్చేందుకు ప్రభుత్వ పెద్దలు విశేష కృషి చేస్తున్నట్లు విమర్శకులు భావిస్తున్నారు.