Friday, November 15, 2024

Safe Journey – తెలంగాణలో కవచ్​! రైల్ ప్ర‌మాదాల‌ నిరోధానికి చర్యలు

389 కిలో మీటర్ల పరిధిలో ఏర్పాటు
ఆటోమెటిక్ బ్లాక్ సిగ్న‌లింగ్ సిస్ట‌మ్
ఎక్కువ దూరం ఆ రూట్​లోనే
నేడు కాంట్రాక్ట్​ కోసం బిడ్​ దాఖలు
₹84.9 కోట్ల అంచనాతో పనులు
18 నెలల్లో ఏర్పాటుకు సన్నాహాలు

ఆంధ్రప్రభ స్మార్ట్​, సెంట్రల్​ డెస్క్​: ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా రావడం, ఆగి ఉన్న రైలును వెనుక నుంచి మరో రైలు ఢీకొట్ట‌డంతో ఎక్కువ‌గా రైలు జ‌రుగుతున్నాయి. ఈ తరహా ప్రమాదాలు జరగకుండా నివారణకు కవచ్​ దోహదం చేస్తుంది. ఈ మేరకు బల్లార్షా-కాజీపేట- విజయవాడ వరకు 514 కిలో మీట‌ర్ల కవచ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఈ దూరంలో రాష్ట్ర పరిధి 378 కిలో మీట‌ర్లు ఉంది. మరోవైపు, వాడి-గుంతకల్లు- రేణిగుంట వరకు 537 కిలో మీట‌ర్ల‌ కవచ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఇందులోనూ రాష్ట్రంలో 11 కిలో మీట‌ర్ల మార్గం ఉంది. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లే రాజధాని, తెలంగాణ, దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లు కాజీపేట-బల్లార్షా మార్గంలో ప్రయాణిస్తాయి. సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌తో పాటు ఈస్ట్‌కోస్ట్, గరీబ్‌రథ్, గోదావరి, చార్మినార్, సింహపురి, శాతవాహన, పద్మావతి, గౌతమి, గోల్కొండ, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లు కాజీపేట-విజయవాడ మార్గంలో రాకపోకలు సాగిస్తాయి.

18 నెలల్లోనే పూర్తి చేయాలని

బల్లార్షా-కాజీపేట-విజయవాడ మార్గంలో కవచ్‌ ఏర్పాటు చేసి ఆ రూట్లో తిరిగే రైళ్ల ఇంజిన్లకు ప్రత్యేక పరికరాలు బిగిస్తారు. దీంతో ఒకే ట్రాక్‌పై జరిగే రైలు ప్రమాదాలను నివారించవచ్చు. కవచ్‌ వ్యవస్థ ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే టెండర్లు చేపట్టింది. ఈ నెల 15వ తేదీన‌ బిడ్లను తెరిచి కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేస్తారు. బల్లార్షా-కాజీపేట-విజయవాడ మార్గానికి సుమారు ₹84.9 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీనిని 18 నెలల్లోనే ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ఈ ప్రకారం 2026 మే వరకు ఈ పనులు పూర్తయ్యేందుకు అవకాశం ఉంది. కవచ్‌తో పాటు ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ 2026లోనే పూర్తయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

ఈ రూట్​లో కవచ్​ ఉంది..
తాజాగా సికింద్రాబాద్‌-రఘునాథ్‌పల్లి మధ్య 86 కిలో మీటర్ల మేర కవచ్‌ పనులు పూర్తయ్యాయి. రఘునాథ్‌పల్లి-కాజీపేట వరకు మరో 60 కిలో మీటర్ల మేర పురోగతిలో ఉన్నాయి. ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌తో ప్రయాణ సమయం కూడా తగ్గతుంది. ప్రస్తుతం ఒక ట్రైన్​ మొదటి స్టేషన్‌ దాటి రెండో స్టేషన్‌ను చేరుకుని, దాన్ని దాటేవరకు మరో రైలును పంపించరు. ఫలితంగా అనేక రైళ్లు సిగ్నల్‌ కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే.. ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ విధానంలో రెండు రైల్వేస్టేషన్‌ మధ్య దూరాన్ని బ్లాక్‌లుగా విభజించి మొదటి ట్రైన్​ ఒక బ్లాక్​ దాటగానే వెనక రెండో రైలు బయల్దేరేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుంది. తెలంగాణలో ఇప్పటికే సనత్‌నగర్‌-వికారాబాద్‌- కుర్‌గుంట, వికారాబాద్‌-మటల్‌కుంట మార్గాల్లో కవచ్‌ వ్యవస్థ ఉంది.

కవచ్ ఎలా పనిచేస్తుందంటే..

అత్యున్నత భద్రతా ప్రమాణాలతో కవచ్‌ వ్యవస్థ పనిచేస్తుంది. రైలును లోకోపైలట్​ ఏ కారణంతోనైనా బ్రేకులు వేయడం మరిచిపోయినా కవచ్​ ఆటోమేటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ (ఏటీపీ) సిస్టమ్‌ పనిచేస్తుంది. దీని ద్వారా ఆటోమేటిగ్గా బ్రేక్‌లు పడతాయి. అందుకు రైలు పట్టాల పొడవునా ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) ట్యాగ్‌ ఏర్పాటు చేస్తారు. ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వేసి, టెలికాం టవర్లు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసి సిగ్నల్‌ వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. ఇంజిన్లకూ పరికరాల్ని బిగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement