Wednesday, November 20, 2024

ఆశ్ర‌యం కావాలా – మా రెస్టారెంట్ కి రండి – కీవ్ లో వ్యాపారి మాన‌వ‌త్వం

ర‌ష్యా , ఉక్రెయిన్ ల మ‌ధ్య భీక‌ర యుద్ధం కొన‌సాగుతోంది. దాంతో స్వదేశం వెళ్లే మార్గం లేక, ఉక్రెయిన్ లో తిండి దొరక్క అలమటించిపోతున్నారు ప‌లువురు. బంకర్లలో ఆశ్రయం దొరికినా ఆహారం లభించని పరిస్థితి ఉంది. ఇలాంటి వేళ… ఓ భారతీయుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఆపన్నహస్తం అందిస్తున్నాడు. అతడే మనీష్ దవే. గుజరాత్ కు చెందిన మనీష్ కీవ్ లోని ఓ జంక్షన్ లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఆ రెస్టారెంట్ పేరు సాథియా. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర షురూ చేయడంతో అనేకమంది భారతీయ విద్యార్థులకు సాథియా రెస్టారెంట్ లో ఆశ్రయం కల్పిస్తున్నారు. ఉండడానికి చోటు మాత్రమే కాదు, వేడి వేడి ఆహారం అందిస్తూ కష్టకాలంలో మానవత్వం చాటుకుంటున్నారు. ఎవరికి ఆశ్రయం కావాలన్నా తమ రెస్టారెంట్ ద్వారాలు తెరిచే ఉంటాయని మనీష్ దవే సోషల్ మీడియాలో ప్రకటించడం ఆయన విశాల హృదయానికి నిదర్శనం.

ఇప్పటి వ‌ర‌కు 100 మందికి పైగా తాము ఆశ్రయం ఇచ్చామని, తమ శక్తిమేర సాయపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ గుజరాతీ వ్యాపారి వెల్లడించారు. కాగా, తమవద్ద ఉన్న సరుకులు మరో మూడు నాలుగు రోజులు వస్తాయని, ఆ తర్వాత కర్ఫ్యూ ఎత్తివేస్తే దుకాణాలకు వెళ్లి మరిన్ని సరుకులు తెచ్చి తమ వద్ద ఆశ్రయం ఉన్న వారికి ఆహారం అందిస్తామని తెలిపారు. దాంతో సాథియా రెస్టారెంట్ పేరు, మనీష్ దవే పేరు అంతర్జాతీయంగా వినిపిస్తోంది. కల్లోల పరిస్థితుల్లో ప్రజలకు ఆశ్రయం కల్పిస్తూ మంచితనానికి మారుపేరులా నిలుస్తున్నారంటూ దవే గురించి అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా పేర్కొంటోంది. ముఖ్యంగా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా సొంత డబ్బుతో వంద మందికి పైగా ఆశ్రయం, ఆహారం అందించడం చిన్న విష‌యం ఏం కాదు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో గుప్పెడు ఆహారం దొర‌క‌డ‌మే గ‌గ‌న‌మ‌యిపోతోంది. దాంతో అంద‌రూ ద‌వేని కొనియాడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement