Wednesday, November 20, 2024

Big Story: సాదా బైనామాల లిటిగేషన్​.. కొత్త ఆర్​వోఆర్​ చట్టంలో సవరణకు ప్రభుత్వం యోచన!

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌ : సాదా బైనామాల(తెల్ల కాగితలపై జరిపిన భూక్రయ విక్రయాలు)పై ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. దరఖాస్తుల స్వీకరణ పూర్తౖ ఏడాది గడుస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం దిశగా యోచిస్తోంది. అయితే కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న కారణంగా సర్కార్‌ నిర్ణయానికి ప్రతికూలంగా మారింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు క్రమబద్దీకరణకు అడ్డంకిగా నిల్చాయి. త్వరలో 9.20లక్షల మంది రైతులకు ఏ విధంగా మేలు చేయవచ్చనే విషయాన్ని ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తోంది.

2014 జూన్‌ 2తో కటాఫ్‌ తేదీగా నిర్ణయించిన సర్కార్‌ అంతకుముందు తెల్ల కాగితాలపై రాసుకున్న క్రయవిక్రయాలకు రిజిస్ట్రేషన్లు ఉచితంగా జరపాలని నిర్ణయించి దరఖాస్తులను స్వీకరించింది. అర్హులైన దరఖాస్తుదారులకు 13బి ప్రొసీడింగ్స్‌ను జారీ చేసి ఆర్డీవోల ద్వారా పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను జారీ చేస్తోంది. గతంలో రెండు దశల్లో అవకాశమిచ్చిన ప్రభుత్వం చివరి విడుతగా మరో అవకావం ఇి్చంది. గతేడాది అక్టోబర్‌ 18నుంచి నవంబర్‌ 10 వరకు రెండు విడతల్లో మొత్తం 9.20లక్షల దరఖాస్తులను స్వీకరించింది.

అయితే 2020 అక్టోబర్‌ 30న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఆర్వోఆర్‌ చట్టం ప్రకారం రద్దయిన ఆర్వోఆర్‌ చట్టం ప్రకారం వచ్చిన దరఖాస్తులను ఎలా పరిష్కరిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అక్టోబర్‌ 29లోపు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని, ఆ తర్వాత వచ్చిన వాటిని పక్కన పెట్టాని హైకోర్టు ఆదేశించింది, కానీ ఇది అమలు చేయడం కష్టతరం కావడంతో తదుపరి ఆదేశాల దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన ఆర్వోఆర్‌ చట్టంలో సవరణలు చేస్తే ఫలితం ఉంటుందని భావిస్తోంది. ఇందుకు అసెంబ్లిలో ప్రభుత్వం చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంది.

గతంలో రెండు దశల్లో సాదా బైనామాలకు అవకావం ఇచ్చిన ప్రభుత్వం గతేడాది మరో అవకాశం ఇచ్చింది. మార్చి 12 నాటికి 2,45,668 ఎకరాల క్రమబద్దీకరణను పూర్తి చేసి నిరుపేదలక ఉచిత రిజిస్ట్రేషన్‌ చేయించాలని నిర్ణయించింది. 2016 జూన్‌ 3న సీఎం కేసీఆర్‌ సాదాబైనామాల ఉచిత క్రమబద్దీకరణ నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో దాదాపు 11,19,112 దరఖాస్తులు రాగా వీటిలో 2,68,610 ఎకరాలకు సంబంధించిన 6లక్షల 18వేల 368 దరఖాస్తులను క్రమబద్దీకరించారు. ఇందులో 4,19,430 దరఖాస్తులను వివిధ కారణాలతో ప్రభుత్వం తిరస్కరించింది.

కాగా వీటికి కూడా అనుమతినివ్వాలని తాజాగా సీసీఎల్‌ఏ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం రెండు దశల్లో పేదలకు ప్రయోజనకారిగా సత్ఫలితాలనిచ్చింది. నిరుపేదలకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి వారికి పట్టాలు అందించారు. 13బీ ధృవీకరణ పత్రాన్ని సేఫ్టీ బార్‌కోడ్‌ క్విక్‌ రెస్పాన్స్‌ కోడ్‌ ఆధారంగా జారీ చేయాలని నిర్ణయించింది. దీంతో గత 20-30 ఏళ్లుగా కాగితాల మీదనే ఉన్న భూముల క్రయవిక్రయాల వ్యవహారం రిజిస్ట్రేషన్‌తో చట్టబద్దం కానుంది. 2014 జూన్‌ 2నాటికి సాదాబైనామాల మీద ఉన్న ఐదు ఎకరాల లోపు భూమిని ఉచితంగా రిజిస్టర్‌ చేసి, పేరు మార్పిడి చేయాలని ఆయన ఆదేశించారు. పట్టణ ప్రాంతాలకు చెందిన దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్‌ అర్భన్‌లో 27.057, వరంగల్‌ రూరల్‌లో 26630, జనగామలో 10,350, సంగారెడ్డిలో 703 కలుపుకుని 64740దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది.

- Advertisement -

దరఖాస్తుల వివరాలు…
జిల్లా దరఖాస్తులు
మహబూబ్‌నగర్‌ 27622
రంగారెడ్డి 5065
హైదరాబాద్‌ 12
మెదక్‌ 59662
నిజామాబాద్‌ 88211
ఆదిలాబాద్‌ 45223
కరీంనగర్‌ 242079
వరంగల్‌ 297699
ఖమ్మం 197845
నల్గొండ 132926

Advertisement

తాజా వార్తలు

Advertisement