Tuesday, November 26, 2024

తెలంగాణలో స్కూల్స్ మూసివేత

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రేపటి నుంచి విద్యాసంస్థల మూసివేయనున్నారు. ఈమేరకు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.  పాఠశాలల విషయమై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి, విద్యాసంస్థలపై చర్చించారు. అనంతరం విద్యాసంస్థలను మూసివేయాలన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో రేపటి నుంచి విద్యాసంస్థలను మూసివేయనున్నారు. ఆన్ లైన్ క్లాస్లు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, మెడికల్ కళాశాలలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది.

తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులకు కరోనా సోకిన ఘటనలు ఇటీవల వరుసగా వెలుగుచూశాయి. ఇప్పటి వరకు 700పైగా మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాసంస్థలు నడిస్తే, కరోనా మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని వైద్యశాఖ హెచ్చరించింది. ఆరు నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులకు బడులు నిర్వహించకపోవడమే మంచిదని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది.

ప్రస్తుతం 6 నుంచి 9 తరగతుల వరకు ప్రత్యక్షంగా క్లాసులు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య పెరగడంతో కోవిడ్‌ నిబంధనల అమలు సాధ్యపడటం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థుల నుంచి వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులకు కరోనా సోకే ప్రమాదం ఉందని వైద్యశాఖ అంచనాకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో విద్యా సంస్థలు నడిపితే కరోనా విజృంభించవచ్చని, 6 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు తరగతులు నిర్వహించకపోవడమే ఉత్తమమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీంతో విద్యా సంస్థల మూసివేతకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement