శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈనెల 15 నుంచి శబరిమల ఆలయం తెరుచుకోనుంది. సోమవారం(నవంబర్ 15) నుంచి భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు అనుమతినిచ్చింది. మండల మకర విళక్కు పండగ సందర్భంగా భక్తులు సందర్శించడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ 15న సాయంత్రం ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో గర్భగుడిని తెరువనున్నారు. ఈ నెల 16 నుంచి భక్తుల ధర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. డిసెంబర్ 26న మండల పూజ ముగియనుంది. మళ్లీ డిసెంబర్ 30న ఆలయాన్ని తెరుస్తారు. 2022 జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఉంటుంది. అనంతరం 20న ఆలయాన్ని మూసివేయనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. కరోనా నిబంధనల ప్రకారం రోజుకు 30 వేల మందిని దర్శనం కోసం అనుమతి ఇవ్వనున్నారు.
మరోవైపు శబరిమలకు వచ్చే వారికి కేరళ ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకుని.. 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చిన వారినే శబరిమలకు అనుమతించనున్నారు. దర్శనానికి వెళ్లే వారు తప్పకుండా తమ ఆధార్ కార్డ్ చూపించాల్సి ఉంటుంది. యాత్రలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించరు. ఇక పంపానదిలో స్నానానికి అనుమతి ఉంటుంది కానీ బస చేసేందుకు అనుమతి లేదు. దర్శనం పూర్తైన వెంటనే ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోవాలి.
కరోనా నేపథ్యంలో గతేడాది తొలుత 1,000 మంది భక్తులను అనుమతించగా… క్రమంగా దానిని 5,000కు పెంచారు. అయితే, ఈ ఏడాది మండలమకరవిళక్కు సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శనానికి ప్రారంభంలో రోజుకు 25 వేల మందిని అనుమతించి, క్రమంగా 30,000 కు పెంచనున్నారు. పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడినవారిని కూడా శబరిమలలోకి అనుమతిస్తారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో టీ.కాంగ్రెస్ నేతలు.. హైకమాండ్ చర్యలుంటాయా?
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily