Tuesday, November 26, 2024

కొత్త సీజేఐగా తెలుగు తేజం

భారత అత్యున్నత న్యాయస్థానం తెలుగు ఠీవితో కళకళలాడబోతోంది. తెలుగు తేజం జస్టిస్ ఎన్‌వీ రమణ భారత దేశ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగమమవుతోంది. ఆయనే తన వారసుడని ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సిఫారసు చేశారు. జస్టిస్ బాబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వారసుడి పేరును సిఫారసు చేయాలని కేంద్రం ప్రభుత్వం సీజేఐని కోరింది. దీంతో బొబ్డే.. తన తర్వాత అత్యంత సీనియర్ అయిన ఎన్.వి. రమణ పేరును ప్రతిపాదించారు. దీంతో జస్టిస్ ఎన్‌వీ రమణ 48వ భారత ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు.

జస్టిస్ బాబ్డే 47వ సీజేఐగా 2019 నవంబరులో ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ ఎన్‌వీ రమణను తదుపరి సీజేఐగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి, సంబంధిత లేఖ నకలును జస్టిస్ రమణకు కూడా జస్టిస్ బాబ్డే అందజేశారు. సీజేఐ జస్టిస్ బాబ్డే పంపిన సిఫారసును కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కేంద్ర హోం శాఖకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నివేదిస్తారు. అనంతరం ప్రధాని మోదీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు నివేదిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి సీజేఐని నియమిస్తారు. సీజేఐగా జస్టిస్ రమణ ఏప్రిల్ 24న ప్రమాణ స్వీకారం చేస్తారు. 2022 ఆగస్టు 26 వరకు సీజేఐగా కొనసాగుతారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ రైతు కుటుంబంలో 1957 ఆగస్టు 27న జన్మించిన ఎన్.వి.రమణ.. ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2000 జూన్‌లో నియమితులయ్యారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2014  ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ ఎస్ఏ బాబ్డే తర్వాత సీనియర్ మోస్ట్ జడ్జి.

జమ్మూ-కశ్మీరులో ఇంటర్నెట్ సస్పెన్షన్‌ను తక్షణమే సమీక్షించాలని రూలింగ్ ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ రమణ కూడా ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి పదవి సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని చెప్పిన జడ్జీల ప్యానెల్‌లో కూడా ఆయన ఉన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నుంచి సీజేఐగా నియమితులయ్యే రెండో సీజేఐగా ఎన్.వి.రమణ రికార్డు సృష్టించబోతున్నారు. సీజేఐగా తొలిసారి బాధ్యతలు నిర్వహించిన తెలుగు తేజం జస్టిస్ కోకా సుబ్బారావు. ఆయన 1966-67 మధ్య కాలంలో సీజేఐగా వ్యవహరించారు. అంతకుముందు ఆయన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement