నర్సంపేట (ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్‌లో చిట్‌ఫండ్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. నెక్కొండ రోడ్డులో గల ‘ఎస్ మేమున్నాం’ చిట్ ఫండ్ సంస్థ బిడ్డింగ్ అయినా అమౌంట్ ఖాతాదారులకు ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఎవరు, ఎంత డబ్బులు లిఫ్ట్ చేశారు అనే విషయాన్ని కూడా చెప్పకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీంతో ఇటీవలే కొంతమంది బాధితులు తాము కట్టిన చిట్టీ డబ్బులు రిటన్ ఇవ్వాలని ఎస్ మేమున్నాం చిట్ ఫండ్ కార్యాలయంలో బైఠాయించారు. దీంతో ఆ చిట్స్ యాజమాన్యం బాధితులకు నచ్చచెప్పి పంపించారు.అయినా చాలా రోజులవుతున్నా చిట్టి డబ్బులు ఇవ్వడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, చిట్ ఫండ్ లో కొత్తగా కట్టే ఖాతాదారులు ఇదంతా మోసంగా ఉందని, కట్టిన అమౌంటు ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరగా నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని బాధితులు అంటున్నారు. ఇప్పటివరకు కట్టిన డబ్బులు వస్తాయో రావో తెలువక అయోమయం అవుతున్నారు. ఉద్యోగులు, వ్యాపారస్తులే టార్గెట్ గా వీరి బిజినెస్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మాయమాటలు చెప్పి ఎస్ మేమున్నామంటూ భరోసా ఇస్తూ ఏజెంట్ల ద్వారా ఖాతాదారులను చేర్చుకుంటూ చివరకు మోసం చేస్తున్న పరిస్థితి.తలెత్తిందని స్థానికులు అంటున్నారు. అధికారులు చిట్ ఫండ్ యాజమాన్యాన్ని పిలిపించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.