రష్యాతో యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్‌ను పునర్నిర్మిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హామీ ఇచ్చారు. ఇప్పుడు జరిగిన నష్టానికి రష్యా ప్రతి పైసా వడ్డీతో సహా చెల్లిస్తుందని ప్రకటించారు. రెండు ప్రపంచ యుద్ధాలు, మూడు కరువులు, చెర్నోబిల్ పేలుడు, క్రిమియా ఆక్రమణ.. ఇలా వీటన్నింటి నుంచీ బయటపడ్డామని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ను పూర్తిగా ధ్వంసం చేయాలని రష్యా అనేకమార్లు ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. కానీ.. ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదన్నారు.
ఇంత జరిగిన తర్వాత తాము భయపడుతూ రష్యాకు లొంగిపోతామని ఎవరైనా అనుకుంటే అది నిజం కాదని, ఉక్రెయిన్ ప్రజల గురించి వారికి ఏమీ తెలియదన్నట్లేనని వ్యాఖ్యానించారు. అసలు ఉక్రెయిన్ గురించి పుతిన్‌కు ఏమీ తెలియదని జెలెన్‌స్కీ ఎద్దేవా చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం భీకరంగా సాగుతోంది. రాజధాని కైవ్, ఖార్కివ్ నగరాల్లో రష్యన్ సైన్యం విధ్వంసం సృష్టించింది. నివాస ప్రాంతాలతో పాటు ఆసుపత్రుల వద్ద పేలుళ్లు జరిగాయి. సైనిక చర్యలు ప్రారంభమై 8 రోజులు కావొస్తున్నా ఉక్రెయిన్ లొంగకపోవడంతో రష్యా ఇప్పుడు ఆర్థిక మూలాలపై దెబ్బతీస్తున్నది. ఇందులో భాగంగా చెర్నిహివ్ ఆయిల్ డిపోపై రష్యా మిస్సైల్స్‌తో దాడి చేసింది.