జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్ వద్ద అణుబాంబు ఉందని ఆరోపించారు. కొన్ని దేశాల మద్దతుతో రష్యాపై యుక్రెయిన్ దాడి చేసే అవకాశం ఉందన్నారు. ఆ దేశం ప్రస్తుతం ఇతరుల చేతిలో కీలు బొమ్మగా మారిందన్నారు. వారికి నాటో హెడ్ క్వార్టర్స్ నుంచి ఆదేశాలు అందుతున్నాయన్నారు. రష్యా బలహీనతను కోరుకుంటున్న అమెరికా యుక్రెయిన్‌ని పావుగా వాడుకుంటోందని ఆరోపించారు పుతిన్. అయితే తమపై దాడికి దిగితే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. డోనెస్కో, లూహాన్స్కుని స్వతంత్ర స్టేట్‌గా ప్రకటించారు పుతిన్. ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే రెండు ప్రాంతాలకు రష్యాన్ ఆర్మీ వెళ్లాలని ఆదేశించారు.
ఇక ఈ రెండు ప్రాంతాలకు రష్యన్ బలగాలు వెళ్లనున్నాయి. ఇకమీదట యుక్రెయిన్ తమకు పొరుగు దేశం మాత్రమే కాదని, రష్యా చరిత్రలో భాగమన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. డాన్‌బాస్‌లో రష్యన్లకు వ్యతిరేకంగా యుక్రెయిన్ యుద్ధం చేయాలని అనుకుంటోందని విమర్శించారు. డాన్‌బాస్‌లో ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని, నాటోలో యుక్రెయన్ చేరికను రష్యాకు ప్రత్యక్ష ముప్పగా పేర్కొన్నారు. యుక్రెయిన్‌లో అధికారంలో ఉన్న వారిని రాడికల్ టెర్రర్ గ్రూపులుగా అభివర్ణించిన పుతిన్ వారిని శిక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు.