ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ ప్రభావం దేశీయ మార్కెట్లపై తీవ్రంగా పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. బొంబేస్టాక్ సెన్సెక్స్ ఏకంగా 2,702 పాయింట్లు కోల్పోయి 54,530 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 815 పాయింట్లు కోల్పోయి 16,300 స్థాయికి దిగువన ముగిసింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.13లక్షల కోట్లుకుపైగా ఆవిరైంది. అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఎటు దారి తీస్తాయో అనే భయందోళనలతో మదుపరులు భారీగా అమ్మకాలకు దిగడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. యుద్ధ ఉద్రిక్తతలకు తోడుగా క్రూడాయిల్ ధరలు కూడా భగ్గుమనడంతో మదుపరులు అమ్మకాలవైపే మొగ్గుచూపారు. రష్యాతోపాటు అంతర్జాతీయ మార్కెట్లు సైతం నష్టాల్లో ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.70 వద్ద ముగిసింది. కాగా సెన్సెక్స్ ఆరంభంలోనే 1800 పాయింట్లకుపైగా నష్టంతో ప్రారంభమైంది. 57,997 పాయింట్లు వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ ఆ తర్వాత 54,383 పాయింట్లకు పతనమైంది.
జాతీయస్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా భారీ నష్టాన్ని నమోదు చేసింది. దాదాపు అన్ని రంగాల సూచీలు 2నుంచి 6శాతం పడిపోయాయి. గురువారం ఉదయం దలాల్ స్ట్రీట్ ట్రేడింగ్ ప్రారంభం కాకముందే రష్యా సైనిక చర్య ప్రకటనతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 5శాతం చొప్పున పతనమయ్యాయి. నిఫ్టీ, సెన్సెక్స్ ఏ ఒక్క షేరు కూడా లాభాన్ని నమోదు చేయలేదు. నిఫ్టీలో టాటా మోటార్స్ అత్యధికంగా 10.28శాతం మేర నష్టపోయింది. యూపీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యూ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. నిఫ్టీలో ఒక్క షేరుకూడా లాభాల్లో ముగియకపోవడం గమనార్షం. రంగాలవారీగా చూస్తే అన్ని రంగాల షేర్లూ నష్టాల్లో ముగిశాయి.మొత్తం 3084 షేర్లు కుదేలయ్యాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సైతం 5శాతం మేర నష్టాన్ని చవిచూశాయి. క్రూడాయిల్ పెరుగుదల ప్రభావంతో ఆయిల్, గ్యాస్ కంపెనీలైన గుజరాత్ గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్, పెట్రోనెట్ ఎల్‌ఎన్జీ, బీపీసీఎల్, గెయిల్ ఇండియా, హెచ్‌పీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా నష్టపోయాయి.
మదుపర్ల సంపద రూ.లక్షల కోట్లు ఆవిరి..
రష్యా సైనిక చర్య కారణంగా స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమవడంతో రూ.13లక్షల కోట్లు మదుపరుల సంపద ఆవిరైంది. గత సెషన్‌లో రూ.255.6లక్షల కోట్లుగా ఉన్న బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ గురువారం నాటి ట్రేడింగ్‌లో రూ.242లక్షల కోట్లుకు చేరింది. ప్రతి 10షేర్లలో 9షేర్లు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. అదేవిధంగా ప్రతి ఆరుస్టాక్స్‌లో ఒకటి లోయర్ సర్క్యూట్‌ను తాకింది. ఫిబ్రవరి డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగిసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడం మార్కెట్ సూచీల పతనానికి ఓ కారణమైంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు పతనానికి కారణమైన రష్యా సైనికచర్య ఆ దేశ స్టాక్‌మార్కెట్‌పైనా ప్రభావం చూపింది. గురువారం ఉదయం మాస్కో స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్‌ను కొంతసేపు నిలిపివేసి అనంతరం మళ్లిd ప్రారంభించగా ఆర్‌టీఎస్ సూచీ 49.93శాతం కుంగింది. మరో సూచీ ఎంఓఈఎక్స్ 45.21శాతం మేర పతనమైంది. ఆసియా మార్కెట్లుతోపాటు ఐరోపా మార్కెట్లు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాయి.
భగ్గుమన్న బులియన్..
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ ప్రకటనతో బంగారం ధరతోపాటు ఒక్కసారిగా వెండిధర కూడా భారీగా పెరిగిపోయింది. గురువారం భారత్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.51వేల మార్కును తాకింది. మరోవైపు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో బంగారం విలువ 2.02 శాతం పెరిగి 51,396కు చేరుకుంది. అదేవిధంగా బంగారంతోపాటు వెండి ధరలు కూడా రెండు శాతం పెరిగాయి. కిలో వెండి ధర రూ.65,876కు చేరుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్‌ను ఆందోళనకు గురిచేశాయి. అయితే బంగారం ట్రేడింగ్‌కు అనుకూలంగా ఉందని ఐసీఐసీఐ డైరెక్ట్ ఓ నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1.9శాతం పెరిగి 1,943.86డాలర్లకు చేరుకుంది. 2021 తర్వాత ఇదే అత్యధికస్థాయి కావడం విశేషం. యూఎస్ గోల్డ్ ప్యూచర్స్ రెండు శాతానికి ఎగబాకి 1,949.20డాలర్లకు పెరిగింది. కాగా ఫిబ్రవరలో పసిడి ధరలు ఇప్పటివరకు 8శాతం పెరిగాయి. ఉక్రెయిన్‌లో యుద్ధ సంక్షోభం కారణంగా స్టాక్‌మార్కెట్లు ప్రభావం బులియన్‌పై తీవ్ర ప్రభావం చూపింది. చమురు ధరలకు కూడా రెక్కలు రాగా స్టాక్ మార్కెట్లు యుద్ధభీతితో కొట్టుమిట్టాడుతున్నాయి.
100డాలర్లుపైకి ముడిచమురు ధర..
ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు పుతిన్ ఆదేశించడంతో ముడి చమురు ధర ఒక్కసారిగా భగ్గుమంది. సుమారు ఏడేళ్ల తర్వాత పీపా చమురు ధర 100 డాలర్లు దాటేసింది. ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద రష్యా దళాల మోహరింపుతో చమురు ధరలు మరింత వేగంగా పెరిగాయి. ఈక్రమంలో గత ఏడేళ్లకంటే అత్యధికంగా బ్రెంట్ క్రూడ్ బ్యారల్ 103 అమెరికా డాలర్లుకు చేరింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్యారెట్ చమురు ధర 103 డాలర్లుకు చేరడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం. 2014తర్వాత మరోసారి ఈ స్థాయికి చమురు ధరలు పెరిగాయి. కాగా 2014 ఆగస్టు 14న గరిష్ఠంగా 103.78 డాలర్లు పలికిన చమురు మళ్లిd ఆ స్థాయికి చేరింది. అయితే అంతర్జాతీయంగా చమురు ధరలుపెరుగుతున్నా మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలే దీనికి కారణంగా చెప్పొచ్చు. మార్చి 7న ఎన్నికలు పూర్తయిన అనంతరం చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా రష్యా చర్యలపై పశ్చిమ దేశాల స్పందనల ఆధారంగా చమురు ధరల్లో మార్పులు ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. భారత్ ముడిచమురు వినియోగంలో దాదాపు 85శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధవాతావరణం చమురు దిగుమతులపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే భారతదేశానికి మధ్య ప్రాచ్య దేశాలతోపాటు ఆఫ్రికా, ఉత్తర అమెరికా నుంచి కూడా ముడి చమురు దిగుమతి అవుతుంది. దేశానికి దిగుమతి అయ్యే చమురులో సౌదీ అరేబియా, ఇరాక్, ఇతర మధ్య ప్రాచ్యదేశాల వాటా 63శాతం ఉండగా, ఆఫ్రికా నుంచి 14శాతం, ఉత్తర అమెరికానుంచి 13.2శాతం ఉంది. ఈనేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల వల్ల భారత్‌పై పాక్షిక ప్రభావం ఉంటుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..