రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇవ్వాల(సోమవారం) జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. రెండు దేశాల మధ్య షరతులు, డిమాండ్లతో ప్రతిష్ఠంభన నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల ప్రతినిధులు 4 గంటల సేపు చర్చలు జరిపారు. ఇరు వర్గాలు తమ వైఖరికే కట్టుబడినట్లు కనిపిస్తున్నది. అమెరికా సారధ్యంలోని నాటో కూటమిలో చేరబోమని ఉక్రెయిన్ లిఖిత పూర్వకంగా రాసివ్వాలని రష్యా డిమాండ్ చేసినట్టు సమాచారం. అలా లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే, సైన్యాన్ని ఉప సంహరిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.
కానీ, నాటో కూటమిలో చేరే విషయమై ఉక్రెయిన్ వెనక్కు తగ్గినట్లు కనిపించడం లేదు. అంతే కాకుండా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. క్రిమియా నుంచి కూడా సైనిక బలగాలను ఉపసంహరించాలని పట్టుబట్టింది. నాటో కూటమిలో చేరేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సిద్ధ పడటం వల్లే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహించి, ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన విషయం తెలిసిందే.