Monday, November 25, 2024

ఒక యుద్ధం – కొంద‌రికి లాభం..

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – యుద్ధమంటే ఎప్పుడూ విధ్వంసమే.. విషాదమే.. జనహననమే.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలెట్టి ఏడాది పూర్తయింది. ఇప్పటికే అధికారికంగా ఇరుపక్షాల్లో కలిపి 3లక్షల మందికి పైగా సైనికులు చనిపోయారు. కొన్ని లక్షల మంది సాధారణ ప్రజలు కూడా ఈ యుద్ధంలో మృతి చెందారు. వీరుకాక లక్షలాదిమంది కట్టుబట్టలతో ఊళ్ళొదిలి సరిహద్దు దేశాలకు పారిపోయారు. ఇప్పటికే ఉక్రెయిన్‌ భారీగా నష్టపోయింది. ఆ దేశం ఎదుర్కొంటున్న యుద్ధ నష్టాలు సుమారు రూ.50లక్షల కోట్లుగా అంచనాలేస్తున్నారు. అయితే యుద్ధం కొన్ని దేశాలకు అనూహ్యమైన లాభాల్ని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా యుద్ధ పరికరాల్ని తయారు చేసే దేశాలు భారీగా లాభపడ్డాయి. అమెరికా, ఐరోపా సమాజం ప్రత్యక్షంగా యుద్ధంలో భాగస్వాములు కాలేదు. కానీ ఉక్రెయిన్‌కు మద్దతుగా సైనిక పరికరాల్ని, ఆయుధాల్ని పంపించాయి. ఇందుకోసం రక్షణ పరికరాల తయారీ దేశాల నుంచి భారీగా ఆయుధాల్ని కొనుగోలు చేశాయి. ఈ ప్రక్రియలో అమెరికాతో పాటు ఫ్రాన్స్‌, జర్మనీ వంటి కొన్ని దేశాలు వ్యాపార ప్రయోజనాల్ని పొందాయి. కాగా ఈ యుద్ధం భారత్‌కు కూడా లాభసాటిగానే మారింది. ఈ యుద్ధంలో భారత్‌ మధ్యస్తంగా వ్యవహరిస్తోంది. ఎటూ మద్దతు ప్రకటించలేదు. తన స్వతంత్ర విధానాలతో
ముందుకెళ్తోంది. కానీ అనూహ్యంగా ఐరోపా సమాజం రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి అతితక్కువ ధరపై భారత్‌ చమురును కొనుగోలు చేయగలిగింది. ఇది దేశంలోని చమురు పరిశ్రమలకు భారీ లాభాల్ని తెచ్చింది. అలాగే దీర్ఘకాలంగా రష్యాతో అంతరిక్ష ఒప్పంద ాలు చేసుకుంటున్న యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ యాక్సెస్‌ అసోసియేట్‌ లిమిటెట్‌ ఈ యుద్ధం నేపథ్యంలో భారత్‌కు చెందిన ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌తో భారీ శాటిలైట్‌ లాంచింగ్‌ కాంట్రాక్ట్‌ను కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్‌ విలువ వెయ్యి కోట్ల రూపాయలకు పై మాటే. ఇలా రెండేళ్ళ పాటు కొవిడ్‌ కారణంగా అతలాకుతలమైన కొన్ని ఆర్థిక వ్యవస్థలు యుద్ధం నేపథ్యంలో మరింత కకావికలం కాగా అమెరికా, భారత్‌ వంటి ఆర్థిక వ్యవస్థలకు ఈ యుద్ధం పరోక్షంగా కొంత మేర లాభాల్నే కలిగించినట్లవుతోంది.

అంతర్జాతీయ శాంతి పరిశోధన ఇనిస్టిట్యూట్‌ వార్షిక నివేదిక మేరకు ప్రపంచ ఆయుధ వ్యాపారంలో 90.3శాతం గుత్తాధిపత్యాన్ని పది దేశాలు కలిగున్నాయి. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ ఈ ఐదు దేశాలు మొత్తం వ్యాపారంలో 75.9శాతం వాటాను పొందుతున్నాయి. 14.4శాతం వాటాను ఇజ్రాయెల్‌, ఇటలీ, దక్షిణకొరియా, స్పెయిన్‌, యునైటెట్‌ కింగ్‌డమ్‌లు కలిగున్నాయి. ఇది కాక 9.7శాతం వాటాను ప్రపంచంలోని 84దేశాలు పంచుకుంటున్నాయి. ఆయుధాల విడిభాగాలు, ఇతర పరికరాల వ్యాపారంలో భారత్‌ వాటా 0.2శాతం మాత్రమే. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొన్ని దేశాలకు ప్రాణ, ఆస్తి నష్టాల్ని కలిగించింది. కానీ అమెరికాలో రేధియాన్‌, లాక్‌ హీడ్‌ మార్టిన్‌ వంటి ఆయుధాల ఉత్పత్తిదార్లకు బిలియన్‌ల డాలర్ల విలువైన ఆర్డర్లను కొని తెచ్చింది. రేథియాన్‌ సంస్థ వాయు రక్షణ వ్యవస్థలను నిర్మిస్తోంది. గెయిడెడ్‌ క్షిపణులు, డెడ్‌లీ మ్యాన్‌ పోర్టబుల్‌ స్ట్రింగర్‌ సిస్టమ్‌లు తయారు చేస్తోంది. అలాగే ఖచ్చితత్వంతో విమానాల్ని కూల్చివేయగల క్షిపణుల తయారీలో కూడా ఈ సంస్థ పేరు గాంచింది. రాకెట్‌ లాంఛర్లతో పాటు లాంఛర్లు అవసరంలేకుండానే క్షిపణుల్ని ప్రయోగించగలిగే వ్యవస్థల్ని కూడా తయారు చేస్తోంది. లాక్‌హిడ్‌ మార్టిన్‌ సంస్థ నిర్దేశిత శక్తి కలిగిన ఆయుధాలు, హైపర్‌సోనిక్‌ విమాన వ్యవస్థలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, వాయు క్షిపణుల తయారీల్లో పేరొందింది. ఈ సం స్థ యుద్ధవిమానాలు, హెలీకాఫ్టర్లు, నైకాదళ వ్యవస్థల తయారీలో ఆరితేరింది. రేథియన్‌, లాక్‌హీడ్‌ మార్టెన్‌ రెండూ సంయుక్తంగా ఎఫ్‌జీఎమ్‌ 148 అగ్ని అనే అత్యాధునిక క్షిపణుల్ని రూపొందించాయి. అలాగే జావెలిన్‌ యాంటీ ట్యాంక్‌ క్షిపణుల్ని కూడా తయారు చేశాయి. తాకిన నేల పరిసరాల్లోని ఆక్సిజన్‌ మొత్తాన్ని పీల్చుకోగలిగే థర్మోబాలిక్‌ ర్యాకెట్లను కూడా ఇవి తయారుచేశాయి. అమెరికాతో పాటు నాటో సభ్య దేశాలు రష్యా సరిహద్దుల వెంబడి మోహరింపు కోసం ఈ అత్యాధునిక ఆయుధ సామాగ్రిని సమీకరించాయి. ఇందులో ఐరోపా సమాజం కీలకపాత్ర పోషించింది. బిలియన్‌ల డాలర్ల విలువైన ఆయుధాల్ని కొనుగోలు చేసి ఉక్రెయిన్‌కు అందించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో పలు దేశాలు వంద బిలియన్‌ డాలర్లకు పైగా ఖర్చు చేసినట్లు అంచనా. జర్మనీ తన స్థూల దేశీయోత్పత్తిలో 2శాతాన్ని ఆయుధాల కొనుగోలు కోసం కేటాయించింది. దేశీయ సైనిక వ్యవస్థల్ని పటిష్టం చేయడంతో పాటు ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జర్మనీ ప్రకటించింది. ఈ చర్యతో అమెరికాలోని ఆయుధ తయారీ వ్యవస్థలు ఆర్థికంగా బలపడ్డాయి. యుద్ధ నేపథ్యంలో అమెరికా సుమారు 700మంది మధ్యవర్తుల్ని వివిధ దేశాలకు పంపించింది. తమ దేశంలో తయారౌతున్న ఆయుధాల్ని కొనుగోలు చేయాల్సిందిగా నచ్చచెప్పింది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా గొప్ప వ్యవస్థగా అవతరించింది. అయితే మారుతున్న పరిస్థితులకనుగుణంగా ఆ దేశం ఎలక్ట్రికల్‌ గృహోపకరణాల తయారీపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఆయుధాల్ని సరఫరా చేయగలిగే సామర్థ్యాన్ని అలవర్చుకుంది. భవిష్యత్‌ ఆయుధ అవసరాల్ని సమర్ధవంతంగా అంచనాలేసింది. క్షిపణులు, జలాంతర్గాములు, రాడార్‌ టెక్నాలజీ, మెటలజీ, సెన్సర్‌ల తయారీపై దృష్టి పెట్టింది. విపరీతమైన ఉష్ణోగ్రతల్లో కూడా సమర్ధవంతంగా పనిచేయగలిగే ఆయుధాల తయారీకి ఉపక్రమించింది. అప్పటి అమెరికన్‌ పాలకుల భవిష్యత్‌ దృక్పథం సరైనదేనని ఇప్పుడు అమెరికా నిరూపించింది.

యుద్ధంలో నేపధ్యంలో భారత్‌ అమెరికాతో వాణిజ్య, సైనిక సంబంధాల్ని పెంచుకుంది. అదే సమయంలో రష్యాతోనూ వాణిజ్య అవసరాల్ని తీర్చుకుంది. అంతకుముందు భారత్‌ దిగుమతి చేసుకుంటున్న చమురులో రష్యా వాటా 0.7శాతం మాత్రమే. ఐరోపా సమాజ ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యా తన చమురును విక్రయించుకునే అవకాశాలు కొరడ్డాయి. ఈ నేపథ్యంలో అతితక్కువ ధరపై భారత్‌కు ఇచ్చేందుకు రష్యా ప్రతిపాదించింది. దీన్ని మోడి ప్రభుత్వం సమర్ధవంతంగా వినియోగించుకుంది. చౌక ధరపై రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంది. చమురుతో పాటు గ్యాస్‌ను కూడా కారుచౌకగా భారత్‌కు రష్యా సరఫరా చేసింది. ఇలా దిగుమతి చేసుకున్న చమురును భారత్‌ దేశీయ అవసరాలకు వినియోగించింది. మరికొంత చమురును శుద్ధి చేసి తిరిగి ఐరోపా దేశాలకు విక్రయిస్తోంది. దీంతో భారతీయ ఇంధన సంస్థలు భారీగా లాభపడ్డాయి. ఇరాన్‌ కూడా రష్యా చర్యల్ని సమర్ధిస్తోంది. దీంతో రష్యా నుంచి చమురు, గ్యాస్‌లను ఇరాన్‌లోని నౌకాశ్రయాల ద్వారా రవాణా చేసుకునే వెసులుబాటు భారత్‌కు ఏర్పడుతోంది. ఇదే పరిస్థితుల్లో ఐరోపా సమాజం రష్యాపై మరికొన్ని ఆంక్షలకు సిద్దపడుతోంది. ఇది కూడా పరోక్షంగా భారత్‌కు కలిసొచ్చే అంశమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement