Monday, November 25, 2024

రూల్స్ మారినై.. ఇక‌పై అన్ని వ‌ర్సిటీల‌కు ఒకే అకాడమిక్​ క్యాలెండ‌ర్..

రాష్ట్రంలోని ఒక యూనివర్సిటీకి చెందిన విద్యార్థులకు తరగతులు ఉంటే.. మరో యూనివర్సిటీ పరిధిలోని పీజీ విద్యార్థులకు సెలవులుండేవి. ఓ యూనివర్సిటీ విద్యార్థులకు పరీక్షలుంటే.. మరో వర్సిటీ విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యేవి. ఇది ప్రస్తుతం రాష్ట్రంలోని ఆరు ప్రధానమైన యూనివర్సిటీల విద్యావిధానం పరిస్థితి. ఈ విధానంతో విద్యార్థుల్లో, అధికారుల్లో కొంత గందరగోళం ఉండేది. ఇకమీదట ఈ విధానానికి అధికారులు స్వస్తిపలకనున్నారు. నూతన షెడ్యూల్‌ ప్రకారం అన్ని వర్సిటీల్లో ఒకే సారి తరగతులు ప్రారంభమై ఒకేసారి పరీక్షలు, సెలవుల విధానాన్ని పాటించనున్నాయి. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ యూనివర్సిటీలు ఇక కామన్‌ పీజీ క్యాలెండర్‌ విధానాన్ని పాటించనున్నాయి. 2021-22 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. హైదరాబాద్‌ మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి నేతృత్వంలో సోమవారం జరిగిన ఆరు యూనివర్సిటీ ఉపకులపతుల సమావేశంలో ఈమేరకు అధికారులు నిర్ణయించారు.

అదేవిధంగా అన్ని వర్సిటీల్లో ఒకేసారి తరగతులు, ఇంటర్నల్స్‌, సెమిస్టర్‌ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూ ల్‌ను రూపొందించ నున్నారు. 2021-22 విద్యాసంవత్సరానికి జనవరి నుంచి పీజీ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఆరు వర్సిటీల్లో ప్రవేశాలకు కామన్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ (సీపీజీఈటీ) నిర్వహిస్తున్న నేపథ్యంలో తరగతులు, పరీక్షలను కూడా ఒకేసారి నిర్వహిస్తే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుందని మండలి ఛైర్మన్‌ లింబాద్రి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement