మేడారం జాతర కోసం టీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. మేడారం జాతర ప్రత్యేక బస్సుల కోసం రూపొందించిన ‘మేడారం విత్ టీస్‌ఆర్టీసీ’ యాప్‌ను బస్‌భవన్‌లో ఆవిష్కరించారు. జాతరకు వెళ్లి వచ్చే వారి కోసం 51 కేంద్రాల నుంచి 3,845 బస్సులు నడుపుతున్నట్టు వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సుల ద్వారా రూ. 30.32 కోట్లు ఆదాయాన్ని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది కోసం మేడారం వద్ద సుమారు 50 ఎకరాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. అక్కడ మౌలిక సదుపాయాలతోపాటు వైద్య బృందాలను అందుబాటులో ఉంచినట్టు సజ్జనార్ తెలిపారు.
మేడార జాతర కోసం సుమారు 12,500 మంది ఆర్టీసీ ఉద్యోగులు సేవలు అందించనున్నట్టు తెలిపారు సజ్జనార్. పార్కింగ్ నుంచి వేడుకల వద్దకు చేరుకునేందుకు 30 షెటిల్ సర్వీసులను కూడా నడపనున్నట్టు వివరించారు. ఒక బృందంలో 30 మంది ప్రయాణికులుంటే వారి కోసం ప్రత్యేక బస్సు కేటాయిస్తామని, ఇందుకోసం కాల్‌సెంటర్ (040-30102829)ను సంప్రదించాలని సూచించారు.