హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఐటీ ఉద్యోగులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ప్రత్యేక షటిల్ బస్‌లను నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. హైటెక్‌సిటీ, మాదాపూర్, గచ్చబౌలి ప్రాంతాల్లో ఈ సర్వీస్‌లను త్వరలోనే నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు వ్యక్తిగత వాహనాల్లో గంటల కొద్దీ ప్రయాణించి ప్రస్తుతం ఆఫీస్‌లకు చేరుకుంటున్నారు. ఈ ప్రత్యేక షటిల్ సదుపాయంతో తక్కువ వ్యయంతోనే సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు చేస్తోంది. షటీల్ సర్వీస్ కోసం ఆన్‌లైన్ సర్వే ద్వారా ఐటీ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను ఆర్టీసీ కోరుతోంది. ఆ సర్వే వివరాల మేరకు భవిష్యత్తులో ఐటీకారిడార్‌లో మరిన్ని షటిల్ సర్వీసులను పెంచబోతోంది.
ఈ షటీల్ సర్వీస్ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే ఐటీ ఉద్యోగులు ఆర్టీసీ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. ఐటీ ఉద్యోగుల కంపెనీ వివరాలు, లోకేషన్, పికప్, డ్రాపింగ్ ప్రాంతాలను విధిగా నమోదు చేయడంతో పాటు తమ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. ఐటీ ఉద్యోగులను సురిక్షితంగా గమ్యస్థానాలను చేర్చడమే ప్రత్యేక షటిల్ బస్ సర్వీస్ ప్రధాన ఉద్ధేశమని అధికారులు పేర్కొన్నారు. అందుకు సాంకేతికత ద్వారా ఈ సేవలను సులువుగా అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది.
ఈ సేవలను వినియోగించుకునేందుకు ప్రత్యేక యాప్‌ను ఆర్టీసీ రూపొందిస్తోంది. ఈ యాప్‌లో టికెట్ బుకింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. అంతేకాకుండా ఈ సర్వీస్‌లను ట్రాకింగ్ సదుపాయం కూడా ఉంది. బస్ ఎక్కడుంది, ఏ ప్రాంతంలో తిరుగుతోంది అనే విషయాలను ట్రాకింగ్ సదుపాయం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. మహిళల భద్రతా నేపథ్యంలో షటీల్ బస్సుల్లో ట్రాకింగ్ సదుపాయాన్ని కల్పించినట్లు ఆర్టీసీ తెలిపింది. ఈ యాప్‌లో సర్వీస్ నంబర్, డ్రైవర్, కండక్టర్ ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలు ఉంటాయని తెలిపింది. అయితే ఈ సదుపాయాన్ని ఐటీ ఉద్యోగులు వినియోగించుకోవాలని ఆర్టీసీ పేర్కొంది.