హైదరాబాద్, ఆంధ్రప్రభ : తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో కొత్తగా నర్సింగ్ కళాశాలను ఈ ఏడాది నుంచి ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. అధునాతన సౌకర్యాలతో ఈ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనుమతించిందన్నారు. ఈ విద్యా సంవత్సరం (మార్చి 2022) నుంచే ప్రారంభమవుతుందన్నారు.
తార్నాక ఆస్పత్రిలో స్వంత వనరులతో నర్సింగ్ కళాశాలను స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన దరిమిలా ఈ కళాశాల ఏర్పాటుకు అవసరమైన అన్ని నిబంధనలు, షరతులను క్షుణ్ణంగా పరిశీలించి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, కౌన్సిల్ రిజిస్ట్రేషన్, కళాశాలకు అనుమతివ్వడం సంతోషంగా ఉందన్నారు.
ఏటా 50 సీట్లతో నర్సింగ్ కళాశాల ప్రారంభమవుతుందని, 30 సీట్లు కన్వీనర్ కోటా కింద, మరో 20 సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేస్తారన్నారు. నగరం నడిమధ్యలో నెలకొల్పుతున్న కళాశాలలో వృత్తిపరమైన, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో పాటు అత్యాధునిక మౌలిక సదుపాయాలు, విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలుంటాయన్నారు. తార్నాక ఆస్పత్రిలో వైద్య సేవలను మరింత అత్యుత్తమంగా అందించడం, సంస్థ ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇక్కడ మౌలిక వసతులన అభివృద్ధి పరిచే దిశలో కూడా తగు చర్యలు తీసుకుంటామన్నారు. నర్సింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం, ఇతర సందేహాల కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040 – 68153333, 040 – 30102829లో సంప్రదించాలని, లేకపోతే ఆర్టీసీ వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చన్నారు.