ఖమ్మం ఆర్టీసీ కొత్త బస్టాండ్ లో ఆర్టిసి ఎండి, సంస్థ వైస్ చైర్మన్ వి సి సజ్జనార్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఇటీవల ప్రారంభం కాగా, బస్టాండ్ లో సదుపాయాలను, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో మోడరన్ బస్టాండ్ గా ఉన్న ఖమ్మం బస్టాండ్ ను పరిశుభ్రతగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ ద్వారా రూ.100 కోట్ల రూపాయల కార్గో వ్యాపారం చేశామన్నారు. మంచి వ్యాపారం ఇచ్చే వారికి డిస్కౌంట్ ఇవ్వనున్నామని చెప్పారు. ఆధునికీకరణను అధికంగా ఆర్టీసీ ఉపయోగించుకుంటుందని పేర్కొన్నారు. టూరిజం కోసం ప్రత్యేకంగా శ్రీరామనవమికి భద్రాచలంకు 350 ప్రత్యేక బస్సులను నడుపుతామని తెలిపారు. మేడారం జాతరలో బంగారాన్ని కార్గో స్కీమ్ ధ్వారా సక్సెస్ అయ్యామన్నారు. భద్రాచలం సీతారాముల తలంబ్రాలు కోసం కార్గో ద్వారా రూ. 80 లకే ఇండ్లకు పంపిస్తామని సజ్జనార్ ప్రకటించారు.
అనంతరం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను మంత్రి క్యాంపు కార్యాలయంలో సజ్జనార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిరువురు కొద్దిసేపు భేటీ అయ్యారు. తొలిసారి ఆర్టిసి ఎండి హోదాలో ఖమ్మం వచ్చిన సజ్జనార్ కు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు.