హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్న నేపథ్యంలో ఉద్యోగార్థులందరూ కోచింగ్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్‌ఆర్‌టీసీ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. కోచింగ్ కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళే వారి కోసం బస్‌పాస్‌లపై 20 శాతం రాయితీని ప్రకటించింది. నిరుద్యోగ యువతకు చేయూత అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్‌లపై ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు.
రాయితీ బస్‌పాస్‌లను పొందాలనుకుంటే దరఖాస్తుకు సంతకం చేసిన ఆధార్‌కార్డుతో పాటుగా కోచింగ్ సెంటర్ గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీని కానీ, లేకపోతే నిరుద్యోగ గుర్తింపు కార్డు జత చేయాలని అధికారులు తెలిపారు. ఆర్డినరీ బస్ పాస్ 3 నెలలకు రూ.3450 కాగా 20 శాతం రాయితీ థర్వాత రూ. 2800లు, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్ రూ. 3900లు కాగా దానిపై రాయితీ తర్వాత రూ. 3200లకు అందించనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పేర్కొన్న సంస్థ ఎండీ సజ్జనార్ పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు టీఎస్‌ఆర్‌టీసీ తరఫున ఆల్ ది బెస్ట్ అని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..