తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగులపై వరాలు కురిపించిన విషయం తెలిసిందే. 30 శాతం పీఆర్సీతో పాటు పదవీ విరమణ వయస్సు 61ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచడంపై రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆర్టీసీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం మాకొద్దీ పెంపు అంటూ చేతులెత్తి వేడుకుంటున్నారు.
ఇప్పటివరకూ తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు రిటైర్మెంట్ కాలం 60 ఏళ్లుగా ఉంది. తాజాగా ప్రభుత్వం దాన్ని మరో ఏడాది పెంచింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కార్పొరేషన్లకూ వర్తింపజేసింది. దాంతో ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో దాదాపు 49 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏటా సగటున 2,200ల మంది పదవీవిరమణ పొందుతున్నారు. అయితే, గత రెండేళ్లుగా ఆర్టీసీలో పదవీవిరమణలు లేకుండా పోయాయి. గతంలోనే 60ఏళ్లకు వయోపరిమితి పెంచడమే ఇందుకు కారణం. ఉద్యోగంలో ఉన్నప్పుడే చాలా మంది అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు. తాజాగా ప్రభుత్వం 61 ఏళ్లకు పెంపుతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్‌లో పనిచేసే మెకానిక్‌లు సంస్థ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపు తమకు వద్దని చాలా మంది డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు కోరుతున్నారు. పాత విధానాన్నే ఉంచాలని వేడుకుంటున్నారు. పాత పద్ధతిలో 58 ఏళ్లకే రిటైరయ్యే వెసులుబాటు కల్పించాలని అధికారులను కోరుతున్నారు.
ఆర్టీసీలో చాలా మంది ఉద్యోగులు గుండెపోటుతో చనిపోతూ ఉంటారు. సరైన నిద్ర, ఆహార నియమాలు పాటించడం వీలు కాదు. పైగా రకరకాల అనారోగ్యాలు వెంటాడుతున్నాయి. రిటైర్మెంట్ వయసు రాకముందే మంచాన పడే పరిస్థితి వస్తోంది. ప్రతి సంవత్సరం రిటైర్ అయ్యేలోపే 200 మంది దాకా చనిపోతున్నారు. దీంతో తమకు 60 ఏళ్లే ఎక్కువ… ఇంకో ఏడాది పెంపు వద్దు అని కార్మికులు చెబుతున్నారు.
ఆర్టీసీలో రెండేళ్ల కిందట రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లే ఉండేది. 2019లో ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 60 ఏళ్లు చేసింది. అప్పట్లోనే ఈ పెంపును కొందరు వద్దన్నారు. ఇప్పుడు మరో ఏడాది పెరగడాన్ని ఆర్టీసీ ఉద్యోగులు తట్టుకోలేకపోతున్నారు.