ఓ ఆర్టీసీ డ్రైవర్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మైలేజీ ఎందుకు తక్కువ వస్తోందంటూ అధికారులు పదేపదే ప్రశ్నించడంతో దుస్తులు విప్పి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..నిజామాబాద్ ఆర్టీసీ డిపో-2లో గణేశ్ 15 సంవత్సరాలుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు నడుపుతున్న బస్సు మైలేజీ (కేఎంపీఎల్) తక్కువ వస్తుండడంతో ఇటీవల ఆయనను పిలిపించిన అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత వారంకూడా గడవకముందే మరోసారి గణేశ్‌ను డీఐ పిలిచి మైలేజ్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. మైలేజ్ తగ్గినందుకు డీఎంను కలవాలని సూచించారు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన డ్రైవర్ గణేశ్.. పాత బస్సులు ఇచ్చి మైలేజీ ఎక్కువ రావాలంటే ఎలా అని ప్రశ్నించాడు. వారం వారం కౌన్సెలింగ్ పేరుతో పిలిచి ఇబ్బంది పెడతారా? అంటూ అసహనం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకకండా ఒంటిపై ఉన్న దుస్తులను విప్పి నిరసన వ్యక్తం చేశాడు. దీంతో అక్కడే ఉన్న తోటి ఉద్యోగులు ఆయనను సముదాయించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ ఉద్యోగుల్లో హాట్ టాపిక్‌గా మారింది.