Thursday, November 21, 2024

ఆర్టీసీ బస్​ రిజ‌ర్వేష‌న్ చార్జీలు పెరిగిన‌య్‌.. అధికారికంగా ప్రకటించని యాజమాన్యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నష్టాల కుంపట్లో నుంచి బయటకు వచ్చేందుకు శత విధాల ప్రయత్నిస్తున్న ఆర్టీసీ చివరకి ప్రయాణికులపై వీలున్న చోటల్లా భారం వేయాలన్న నిర్ణయానికి వచ్చింది. నెల రోజుల వ్యవధిలో టోల్‌ చార్జీలు, డీజిల్‌ సెస్‌, రౌండప్‌ల పేరుతో మూడు పర్యాయాలు చార్జీలను బాదిన ఆర్టీసీ రిజర్వేషన్‌ ప్రయాణికులపై కూడా భారాన్ని మోపినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. రిజర్వేషన్‌ ప్రయాణికులపై మార్చి 27 నుంచే బదుడు మొదలు పెట్టిన యాజమాన్యం ఎక్కడా అధికారికంగా ప్రకటించకుండా గోప్యతను పాటించింది. సంస్థ గురించి నిత్యం ట్విట్టర్‌తో పాటు వేర్వేరు సామాజిక, ప్రచార మాధ్యమాలలో ఊదరగొట్టే యాజమాన్యం ప్రయాణికులపై వేస్తున్న భారం గురించి బహిర్గతం చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

డీజిల్‌ సెస్‌ పేరుతో ఆర్డినరీ బస్సులలో కనీస చార్జీని రూ. 5 నుంచి 10కి పెంచడం, మిగతా సర్వీసులలో రూ. 10 నుంచి 15 కు పెంచిన యాజమాన్యం తర్వాతి చార్జీలలో స్వల్ప పెంపుదల అని పేర్కొంది. ఆర్డినరీ బస్సులలో మొత్తంగా కేవలం రూ. 2 పెంచినట్లు పేర్కొన్నప్పటికీఆచరణలో మాత్రం రూ. 5 వసూలు చేస్తున్నారు. కొన్ని బస్సులలో చార్జీల వసూలు అసంబద్దంగా ఉన్నాయి. ఆర్టీసీకి అసలే అంతంత మాత్రంగా ప్రయాణికుల ఆధరణ ఉంది. ఈ నేపథ్యంలో శాస్త్రీయంగా చార్జీల పెంపును అణలు చేయకుండా ఇష్టానుసారంగా వసూలు చేస్తుండటంతో రోజురోజుకూ విమర్శలు వెల్లివెత్తుతున్నాయి

ఓఆర్‌ పెరగలే తగ్గింది
సంస్థ పట్ల ఆధరణ పెరుగుతోందని, ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) పెరిగిందంటూ అధికారులు గణాంకాలను చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు విరద్ధంగా ఉంది. ఓఆర్‌ 64, 65 శాతం నుంచి 74 శాతానికి ఎగబాకిందని అధికారులు చెబుతున్నారు. కానీ బస్సులను తగ్గించిన విషయాన్ని మాత్రం ఎక్కడా వెల్లడించడం లేదు. గతం 10 వేల పై చిలుకు బస్సులు ఉండగా, అప్పుడు కేవలం ఆరు వేల పై చిలుకు బస్సులు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. ఏకంగా నాలుగు వేల బస్సులను తగ్గించడంతో ఉన్న బస్సులతోనే ప్రయాణికులు సర్ఢుకోవాల్సి వస్తోంది. గతంలో మాదిరిగా బస్సుల కంటే ఉండి ఉంటే ఇప్పుడు ఓఆర్‌ 56 శాతానికి ఉండేదని అనధికారికంగా అధికారులు పేర్కొంటున్నారు. బస్సులు తగ్గడంతోనే ఓఆర్‌ పెరిగినట్లు కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. కాలనీలకు బస్సులను నడపకపోవడం, కొన్ని రూట్లలో లాభాలు రావడం లేదన్న సాకుతో బస్సులను నిలిపి వేయడంతో వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగిందని, వ్యక్తిగత వాహనాలకు అలవాటు పడిన వారంతా తిరిగి బస్సుల వైపు చూడటం లేదని అధికారులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement