ఏపీలో ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదని, అసవరమైన మేరకు వాటి నిల్వలు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. గురువారం నుంచి ట్రూనాట్ టెస్టులు ప్రారంభించడంతో పాటు ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచుతున్నామని వెల్లడించారు. జిల్లా స్థాయిలో ఆక్సిజన్, రెమిడిసివిర్ ఇంజక్షన్ల నిల్వలు సక్రమంగా వినియోగం అవుతున్నాయా లేదా అన్న విషయంపై ఆడిట్ చేయాలని అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ లను ఆదేశించామన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులకు రెమిడెసివిర్ ఇంజక్షన్లను ప్రభుత్వమే సరఫరా చేస్తోందన్నారు. ప్రభుత్వాసుపత్రులు, నెట్ వర్క్ ఆసుపత్రుల్లో రెమిడెసివిర్, ఆక్సిజన్, ఇతర మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెమిడిసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా అడ్డుకోవడంతో పాటు వినియోగంలో అక్రమాలను అడ్డుకోడానికి జిల్లా స్థాయిల్లో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. అందరికి రెమెడిసివిర్ అవసరం ఉండదని, అతి కొద్దిమంది కి మాత్రమే ఈ ఇంజెక్షన్ అవసరం ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం రెమెడిసివిర్ ఇంజెక్షన్ 28,994 డోసులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయని గణాంకాలతో సహా సింఘాల్ వివరించారు. 5,300 డోసులు డ్రగ్ ఇన్స్పెక్టర్ ద్వారా ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చామని స్పష్టం చేశారు. వారు నేరుగా కూడా ఏజెన్సీల నుంచి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. 11 వేల డోసులు ప్రైవేటు హాస్పిటల్స్ కు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో గత మూడు రోజుల్లో 30 వేల రెమిడిసివిర్ ఇంజక్షన్లు వినియోగిస్తే ఇక కొరత ఎక్కడుందన్నారు. బయటకు వెళ్లి ఇంజెక్షన్ కొనుగోలు చేయండంటూ రోగులకు చెప్పిన ఆస్పత్రులల్లో తనిఖీ చేయమని ఇప్పటికే ఆదేశించామని పేర్కొన్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారులకు రెమిడిసివిర్ ఇంజక్షన్ల నిల్వ, రోగుల సంఖ్యపై రేపటి నుండి ఆడిట్ నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇంజెక్షన్ల నిల్వ ఉండి కూడా కొరత ఉందని చెబితే బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నట్టేనన్నారు. రెమెడిసివిర్ పై ధరలు గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చిన విషయం గుర్తు చేశారు. రోగులెవరూ అధిక ధరలకు ఇంజక్షన్లు కొనవద్దని మరోసారి సూచించారు. రెమిడిసివిర్ కొరత ఉన్నచోట వెంటనే అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టామన్నారు.
గత ఏడాది కరోనా వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న సమయంలోనే 116 కోవిడ్ కేర్ సెంటర్లు ఉన్నాయని, ప్రస్తుతం 422 కోవిడ్ ఆస్పత్రులు కరోనా చికిత్స అందిస్తున్నాయని వెల్లడించారు. ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స అవసరమయ్యే రోగులు చికిత్స పొందేలా, వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న వ్యక్తులు కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ కేర్ సెంటర్లలో రోజుకు ప్రతి వ్యక్తికి (బాధితుడికి) 500 రూపాయల ఖర్చుతో నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఔషదాలు అందిస్తున్నామని తెలిపారు. ఇళ్ల వద్ద హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి టెలి కన్సల్టెన్సీ ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు. ఆస్పత్రుల పడకల ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకునే విధంగా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూనే స్వీయ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అనిల్ కుమార్ సింఘాల్ కోరారు.
రాష్ట్రంలో మొత్తం 5,022 ఐసీయూ పడకలు, 18,600 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. 10 వేల పడకల్లో చికిత్స జరుగుతోందని తెలిపారు. మరో 11 వేల సాధారణ పడకలు ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం 9 వేల పడకల్లో రోగులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రతీ రోజు పడకల వివరాలు అందించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. రియల్ టైమ్ బేసిన్ లో వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని మంత్రుల కమిటీ ఆదేశించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. డేటా అప్డేట్ కోసం గ్రామ సచివాలయాల్లో ఉన్న డిజిటల్ అసిస్టెంట్ల సేవలు వినియోగించుకుంటామని తెలిపారు.
గత ఏడాది కరోనాకు సంబంధించి గరిష్టంగా పాజిటివ్ కేసులు వచ్చినప్పుడు 280 మెట్రిక్ టన్నుల వినియోగం అయ్యిందని ప్రస్తుతం 423 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఏపీకి సరఫరా అయ్యిందని అదే స్థాయిలో వినియోగం కూడా ఉందన్నారు. అవసరాన్ని బట్టి కానీ ఇప్పుడు రెండింతలుగా ఆక్సిజన్ వినియోగం అవుతోందని తెలిపారు. నెల సరిపడా నిల్వలు ఉంచుకునే పరిస్థితి లేదన్నారు. రోజువారీగా ఈ నిల్వలపై కొరత రాకుండా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 4 కొత్త ఆక్సిజన్ యూనిట్లలో 26 టన్నుల మెడికల్ ఆక్సిజన్ తయారు చేసి వినియోగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కొంత పొదుపు చేసే అవకాశం ఉన్నా మరొకరికి ప్రాణదానం చేసినట్టేనని సూచించారు. కోవిడ్ కేర్ కేంద్రాల్లో 33,427 పడకలు అందుబాటులో ఉన్నాయని, ఆక్యుపెన్సీ మాత్రం 4,703 మాత్రమే ఉందన్నారు. లోపం ఎక్కడుందో అర్థం కావడం లేదన్నారు. జిల్లా కలెక్టర్ లు ఈ అంశంపై దృష్టి పెట్టాలని ఆదేశించామన్నారు. నిర్లక్ష్యం చేసిన అధికారులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 74,748 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో 14,669 పాజిటివ్ కేసులు నమోదు కాగా 71 మంది మృతి చెందారని తెలిపారు. పాజిటివిటీ రేటు 16.48 శాతం ఉందన్నారు. మోర్టాలిటీ రేటు 0.74 ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖచ్చితత్వం కోసం అన్నీ ఆర్టీపీసీఆర్ ద్వారానే పరీక్షలు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సంబంధిత పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,62,17,831 పరీక్షలు నిర్వహించగా అందులో 10,69,544 మందికి పాజిటివ్ నమోదుకాగా 6.59 పాజిటివిటీ రేటు, 7879 మరణాలు నమోదయ్యాయని వివరించారు.
కరోనా కట్టడికి అన్నిరకాల చర్యలు చేపట్టామని అదే సమయంలో కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచామని తెలిపారు. ఈ సందర్భంగా 104 కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులు సక్రమంగా పర్యవేక్షణ చేయాలని జాయింట్ కలెక్టర్లకు బాధ్యతనిచ్చామన్నారు. 104 కాల్ సెంటర్ కు రోజుకు దాదాపు 7 వేలకు పైగా కాల్స్ వస్తున్నాయని తెలిపారు. కాల్స్ పెరుగుతున్న దృష్ట్యా ప్రజలకు మరింత అందుబాటులో ఉండేందుకు రోజుకు మూడు షిప్టుల్లో 60+60+30 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, 21 మంది డాక్టర్లు ఆన్ లైన్ లో సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అందుబాటులో ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.