రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంస్థల పదాధికారుల సమన్వయ సమావేశాలు జనవరి 5 నుండి 7 వరకు భాగ్యనగర్ శివారు అన్నోజిగూడ లో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయతో సహా ఐదుగురు సహ కార్యవాహలు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొంటున్నారు.
ఈ సమావేశాల్లో మొత్తం 36 సంస్థలకు చెందిన 216 మంది పదాధికారులు పాల్గొంటున్నారని ఆర్ ఎస్ ఎస్ ముఖ్యులు తెలిపారు. ‘‘విద్య, ఆర్ధిక రంగం, సేవా మొదలైన వివిధ సామాజిక రంగాల్లో నిరంతరం పనిచేస్తున్నాయి. ఇలాంటి సంస్థలలో పనిచేసే స్వయంసేవకులతో సంఘం సమన్వయాన్ని కొనసాగిస్తుంది. వర్తమాన పరిస్థితుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయి అనే విషయాలను అన్ని సంస్థలకు చెందిన ప్రతినిధులు వివరిస్తారు.’’ అని ఆర్ ఎస్ ఎస్ ప్రతినిధులు పేర్కొన్నారు.
కాగా, ఈ సమావేశాలకు అటెండ్ అవుతున్న అందరూ కొవిడ్ నిబంధనలకు లోబడి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని, కరోనా నిబంధనలకు అనుగుణంగానే మీటింగ్స్ జరుగుతాయని అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునిల్ అంబేకర్ తెలిపారు.