Saturday, November 23, 2024

తొలుత వెంకయ్య… తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్.. నెక్ట్స్ ఎవరు?

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్సనల్ అకౌంట్‌కి వెరిఫైడ్ బ్లూ బ్యాడ్జిని తొలగించి తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఉపరాష్ట్రపతి కార్యాలయం అభ్యంతరం వ్యక్తం చేయడంతో తిరిగి బ్లూ బ్యాడ్జిని పెట్టింది. తాజాగా ఆర్ఎస్ఎస్ నాయకుల అకౌంట్లను అన్-వెరిఫైడ్ చేస్తోంది. వాటికి ఉండే అధికారిక బ్లూ కలర్ బ్యాడ్జిని తొలగిస్తోంది. అరెస్సెస్ చీఫ్‌ మోహన్ భగవత్ ఖాతాకు బ్లూ టిక్ ను తీసేసింది. ఆయనతో పాటు మరో నలుగురు ఆరెస్సెస్ ప్రముఖుల ఖాతాల్లోనూ టిక్ మార్క్ ను తొలగించింది. ఆరెస్సెస్ జాయింట్ జనరల్ సెక్రటరీలు కృష్ణగోపాల్, అరుణ్ కుమార్, జనరల్ సెక్రటరీ సురేశ్ భయ్యాజీ జోషి, సంపర్క్ ప్రముఖ్ అనిరుధ్ దేశ్ పాండేల ట్విట్టర్ ఖాతాకు బ్లూ మార్క్ ను తొలగించింది.

మరోవైపు ట్విట్టర్ తీరుపై అర్ఎస్ఎస్ వర్గాలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల కన్నా ఎక్కువ కాలం పాటు వాడని ఖాతాలు ఎన్నో ఉన్నాయని, మరి, వారి ఖాతాలకు ఎందుకు బ్లూ టిక్ ను తీసేయట్లేదని నెటిజన్లు ట్విట్టర్ ను ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తున్నారు. బ్లూ మార్క్ ను తొలగించడానికి కారణం ఖాతాలను ఎక్కువ రోజులు వాడకపోవడమే అయితే దానికి కనీసం సమాచారమైనా ఇవ్వాలి కదా? అని ఆర్ఎస్ఎస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

ట్విట్టర్ తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శుక్రవారం ఉదయాన్నే ముందుగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అకౌంట్‌కి బ్లూ బ్యాడ్జి తొలగించింది. అయితే, దీనిపై ఉపరాష్ట్రప‌తి కార్యాల‌యం అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌డంతో ట్విట్ట‌ర్‌ మ‌ళ్లీ బ్లూ టిక్‌ను ఇచ్చింది. సాధార‌ణంగా ట్విట్ట‌ర్ ప‌లు ర‌కాల ఖాతాల‌కు బ్లూ టిక్‌ను ఇస్తుంది. ఈ బ్యాడ్జి ఉండే ఆ ఖాతాలను ట్విట్ట‌ర్ ధ్రువీక‌రించింద‌ని, ఆ ఖాతాలు న‌కిలీవి కావ‌ని అర్థం. ప్ర‌భుత్వ సంస్థ‌లు, బ్రాండ్లు, లాభాపేక్ష లేని  స్వ‌చ్ఛంద సంస్థ‌లు, వార్తా సంస్థ‌లు, జ‌ర్న‌లిస్టులు, ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌లు, క్రీడాకారులు, సామాజిక కార్య‌క‌ర్త‌లు, రాజ‌కీయ నాయ‌కులకు బ్లూ టిక్ ఇస్తుంది.

ఇది కూడా చదవండి: వెంకయ్యనాయుడు అకౌంట్‌కి మళ్లీ బ్లూ బ్యాడ్జి

Advertisement

తాజా వార్తలు

Advertisement