రూ. 2 వేల నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నట్లు ఆర్‌బీఐ చేసిన ప్రకటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏ ఇద్దరు మాట్లాడుకున్నా రూ. 2 వేల నోటు ఉపసంహరణ అంశం వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్తగా 2 వేల నోట్ల ముద్రణ ఉండదని.. మార్కెట్ లో ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలంటూ 2023, మే 19వ తేదీన ఆర్బీఐ ప్రకటించడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. చాలా మంది నేరుగా బ్యాంకు శాఖలకు చేరుకుని మార్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే నేడు బ్యాంకుల వద్ద, ఏటీఎం కేంద్రాల వద్ద రద్దీ కనిపిస్తోంది. నిజానికి రూ.2,000 నోట్లను చాలా నెలలుగా బ్యాంకులు ఏటీఎం యంత్రాల్లో ఉంచడం లేదు. దీంతో ఈ నోట్లు చాలా తక్కువ మంది వద్దే ఉన్నాయి. ఆర్బీఐ తాజా నిర్ణయంతో మిగిలినవీ బ్యాంకులకు చేరనున్నాయి.
ఈ పెద్ద నోటును ఉపసంహరించుకునే యోచన ముందు నుంచే ఉందనడానికి నిదర్శనంగా దీని ముద్రణను 2018లోనే నిలిపివేశారు. డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరగడం, కరెన్సీ వినియోగం తగ్గడంతో పెద్ద నోట్లను తొలగించాలనే నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. 2016లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన సమయంలో రూ.2,000 నోటును ప్రవేశపెట్టారు. వ్యవస్థలో 90శాతం నగదు చట్టబద్ధమైన చెల్లుబాటును రద్దు చేయడంతో, కరెన్సీ కొరతను అధిగమించేందుకు ఆర్బీఐ అప్పట్లో రూ.2,000ను ప్రవేశపెట్టింది. నాడు నోట్ల రద్దుతో ప్రజలు, చిన్న పరిశ్రమలు నానా ఇబ్బందులు పడ్డాయి. కానీ, నేడు కరెన్సీ వినియోగం పెద్దగా లేకపోవడం, కొంతకాలంగా రూ.2,000 నోట్లను పంపిణీ చేయడకపోవడం తదితర అంశాలతో ఈ విడత సామాన్యుడికి పెద్దగా అగచాట్లు ఉండకపోవచ్చు. అయితే మెదక్ జిల్లాలో బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద రూ.2వేల నోట్ల మార్పిడి కష్టాలు మొదలయ్యాయి. ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేస్తే రూ.2వేల నోట్లు వస్తుండడంతో వాటిని మార్చుకునేందుకు మళ్లీ బ్యాంకుల వద్దకు వెళ్తున్నారు. దీంతో బ్యాంకుల వద్ద ప్రజలు భారీగా క్యూలు కడుతున్నారు.