జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన 16వ పారాలింపిక్స్ భారత క్రీడాచరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయాయి. తొలిసారి భారత అథ్లెట్లు 19పతకాలు సాధించి అద్భుత ప్రదర్శనతో రాణించారు. భారత్ ఖాతాలో 5స్వర్ణాలు, 8రజతాలు, 6కాంస్య పతకాలు చేరాయి. టోక్యో 2020 పారాలింపిక్స్‌లో భారత్ 19పతకాలతో 24వ స్థానంలో నిలిచింది. మొత్తం 54మంది భారత బృందంలో17మంది పతకాలు కైవసం చేసుకున్నారు. గత 60ఏళ్ల చరిత్రలో పారాలింపిక్స్‌లో మన అథ్లెట్లు 19పతకాలు సాధించడం ఇదే తొలిసారి. కాగా టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు హైజంప్‌లో 4 పతకాలు, జావెలిన్‌త్రోలో 3పతకాలు, డిస్కస్‌త్రోలో ఓ పతకం సాధించారు. అదేవిధంగా షూటింగ్‌లో 5పతకాలు, బ్యాడ్మింటన్‌లో 4పతకాలు, ఆర్చరీలో ఒకటి, టేబుల్ టెన్నిస్‌లో ఓ పతకంతో కలిపి భారత ఖాతాలో మొత్తం 19పతకాలు చేరాయి. పారాలింపిక్స్‌లో గరిష్ఠంగా మన అథ్లెట్లు ఈసారి 5స్వర్ణాలు సాధించారు. పురుషుల జావెలిన్ త్రో, ఎఫ్-64విభాగంలో సుమిత్ స్వర్ణం సాధించగా, బ్యాడ్మింటన్ ఎస్‌హెచ్-6లో కృష్ణనాగర్ స్వర్ణం, ఎస్‌ఎల్-3లో ప్రమోద్ భగత్ స్వర్ణం సాధించాడు.
షూటింగ్‌పీ4 మిక్స్‌డ్ 50మీటర్లు పిస్టల్ ఎస్‌హెచ్-1లో మనీశ్‌నర్వాల్ పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళల షూటింగ్ విభాగంలో భారత షూటర్ అవని లేఖరా 10మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్-1లో స్వర్ణం సాధించింది. పురుషుల డిస్కస్ త్రోలో యోగేశ్ కతునియా రజతం సాధించగా, పురుషుల హైజంప్ టీ-47లో నిషాద్‌కుమార్, టీ-63లో మరియప్పన్ తంగవేలు రజతాలు కైవసం చేసుకున్నారు. పురుషుల జావెలిన్ త్రోలో దేవేంద్ర జజరియా, బ్యాడ్మింటన్‌లో యతిరాజ్ సుహాస్, టేబుల్ టెన్నిస్‌లో భవీనాబెన్ పటేల్, షూటింగ్ పీ-4 మిక్స్‌డ్ 50మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్-1లో సింగ్‌రాజ్ రజతాలను సొంతం చేసుకున్నారు. కాంస్య పతకాలు సాధించినవారిలో.. ఆర్చరీలో హర్వీందర్‌సింగ్, పురుషుల హైజంప్‌లో శరద్‌కుమార్, జావెలిన్ త్రోలో సుందర్‌సింగ్ గుర్జార్, బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో మనోజ్ సర్కార్ కాంస్యం సాధించారు.
అదేవిధంగా ఆర్ 8 మహిళల 50మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో అవని లేఖరా కాంస్యాన్ని కైవసం చేసుకుని ఈ పారాలింపిక్స్‌లో రెండో పతకాన్ని సొంతం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణం సాధించగా పారాలింపిక్స్‌లోనూ జావెలిన్‌త్రోలో సుమిత్ దేశానికి స్వర్ణం అందించడం విశేషం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital