Friday, November 22, 2024

Big Story | భారీ వ‌ర్ష‌ల‌కు దెబ్బ‌తిన్న రోడ్లు.. పంట పొలాల్లో ఇసుక మేట‌లు!

గ్రామాలకు పట్టణాలకు మధ్య అనుసంధానంగా ఉన్న లింకు రోడ్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో ఉధృతంగా వచ్చిన వరదల దెబ్బకు రోడ్లు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. ఇవన్నీ ఈ మధ్య కాలంలో వేసిన రోడ్లేనని, నాసిరకం పనుల వల్లనే వానలకు కొట్టుకుపోయాయని స్థానికులు అంటున్నారు. కాంట్రాక్టర్ల కక్కుర్తితో ప్రజలకు ఇబ్బందులు ఎదురవ్వడమే కాకుండా లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది. ఇక.. పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో వాటిని తొలగించి, సాగు చేసుకునేదెలా అని రైతులు తలపట్టుకుంటున్నారు.

భీంగల్ టౌన్, (ప్రభన్యూస్): వారం రోజలుగా కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవనం స్తంభించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన‌ల‌కు అపార నష్టం సంభ‌వించింది. నిజామాబాద్ జిల్లా భీమ్‌గ‌ల్‌ మండల కేంద్రానికి అనుసంధానం చేసే ప్రధాన రోడ్ల‌న్నీ కోతకు గురయ్యాయి. దాంతో రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దెబ్బ‌తిన్న రోడ్ల‌కు తాత్కాలిక రిపేర్లు చేసేందుకు యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భీంగల్ మండలం పల్లికొండ, కుప్కల్, బడా భీంగల్ రూప్లాతండా, చెంగల్, చింతలూర్ గ్రామాలకు వెళ్లే దారులు కోతకు గురై రాక పోకలకు అంతరాయం కలుగుతోంది.

- Advertisement -

కుప్కల్ నుండి దోన్ పాల్ వెళ్లే రహదారిలో, భీంగల్ నుండి లింబాద్రి గుట్టకు వెళ్లే దారిలో నూతనంగా నిర్మించిన కల్వర్ట్ లకు రెండు వైపుల చివరలో వేసిన మట్టి కొట్టుకుపోయింది. నిర్మాణం సమయంలో నాణ్యత ప్రమాణాలు పట్టించుకోకుండా చేప‌ట్టిన పనులే దీనికి కారణం అని ప్రజలు ఆరోపిస్తున్నారు. మొగిలి చెరువు నుంచి వచ్చిన నీటి ప్రవాహానికి కొత్త బస్టాండ్ వద్ద ప్రధాన రహదారి కోతకు గురై కుంగి పోయింది. జల విలయం కారణంగా మండలంలోని మొగిలి చెరువు, బడా భీంగల్, ముచ్కూర్ తదితర గ్రామాల్లోని చెరువులు తెగి పోయాయి.

ఏకదాటిగా కురిసిన వర్షానికి కప్పల వాగు ఉదృతంగా ప్రవహించడంతో వాగుకు ఇరువైపులా ఉన్న సుమారు రెండు వందల ఎకరాల్లో ఇసుక మేటలు పెట్టాయి. వేసిన పంటలు నష్టపోగా, భూముల్లో ఇసుక మేటల కారణంగా పనికిరాకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకుని, దెబ్బ‌తిన్న రోడ్లను బాగు చేయించేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని మంత్రి వేముల స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement