మానససరోవర్ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. చైనా లేదా నేపాల్ మీదుగా ఇంతకుముందు జర్నీ చేసేవాళ్లు. అట్లా కాకుండా ఇకమీదట ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ నుంచి నేరుగా మానససరోవర్‌కు వెళ్లే మార్గాన్ని రూపొందిస్తున్నట్టు ఇవ్వాల పార్లమెంట్లో ప్రకటించారు. ఈ రహదారి వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని చెప్పారు గడ్కరీ. ఉత్తరాఖండ్ మీదుగా నిర్మిస్తున్న రహదారితో సమయాన్ని తగ్గించడమే కాకుండా ప్రస్తుత ప్రమాదకరమైన ట్రెక్‌లా కాకుండా సాఫీగా జర్నీ చేయొచ్చని తెలిపారు. తమ మంత్రిత్వ శాఖ జమ్మూ కాశ్మీర్‌లో రోడ్డు కనెక్టివిటీని పెంచుతోందని, ఇది శ్రీనగర్, ఢిల్లీ లేదా ముంబై మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుందని గడ్కరీ పార్లమెంటులో తెలిపారు. ఈ ప్రాజెక్టులకు రూ.7 వేల కోట్లు ఖర్చయిందని చెప్పారు.
లడఖ్ నుండి కార్గిల్, కార్గిల్ నుండి జెడ్-మోర్, జెడ్-మోర్ నుండి శ్రీనగర్, శ్రీనగర్ నుండి జమ్మూ వరకు నాలుగు సొరంగాలు నిర్మిస్తున్నారు..- జోజిలా సొరంగంలో ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 1,000 మంది కార్మికులు సైట్‌లో ఉన్నారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 2024 గడువు ఇచ్చాం అని మంత్రి చెప్పారు. నిర్మాణంలో ఉన్న ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్ ప్రెస్‌వే ఢిల్లీ, శ్రీనగర్ మధ్య ప్రయాణాన్ని కేవలం ఎనిమిది గంటలకు తగ్గిస్తుందని గడ్కరీ చెప్పారు.
రహదారి మంత్రిత్వ శాఖ 650 మార్గాంతర సౌకర్యాలతో రహదారులను సన్నద్ధం చేస్తుందని గడ్కరీ పార్లమెంటులో వెల్లడించారు. “మేము 28 హైవేలను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో విమానాల కోసం అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాలు ఉంటాయి. డ్రోన్లు కూడా అక్కడ దిగవచ్చు. ప్రమాదం జరిగితే, హెలికాప్టర్ అంబులెన్స్ కూడా చేయవచ్చు”అని గడ్కరీ వివరించారు. రైలు మార్గం జాతీయ రహదారులను దాటిన ప్రతిచోటా రోడ్ ఓవర్‌బ్రిడ్జిలు లేదా ఆర్‌ఓబిలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైల్వే క్రాసింగ్‌ల నుండి జాతీయ రహదారులను తొలగించే ప్రతిష్టాత్మక కార్యక్రమం సేతు భారతం కింద చేపడుతున్నట్టు తెలిపారు.