మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంక్షోభానికి కారణమవుతున్న బీజేపీ.. శివసేన రెబల్స్‌ని కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? లేకుంటే ఉద్ధవ్ థాక్రేనే తన ప్రభుత్వాన్ని కాపాడుకుంటారా? అనే అనేక పొలిటికల్ సిచ్యుయేషన్స్ నడుస్తుంటే.. మరోవైపు బిహార్‌లో కూడా ఇట్లాంటి చిన్న తిరుగుబాటు ఎదురయ్యింది. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (RJD), AIMIM పార్టీని విచ్ఛిన్నం చేసింది. ఎంఐఎం పార్టీకి చెందిన అయిదుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు ఇవ్వాల (బుధవారం) ఆర్జేడీలో చేరారు. దీంతో 80 అసెంబ్లీ స్థానాలతో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది.
ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆర్జేడీలో విలీనం కావడంతో వికాశీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) ఎమ్మెల్యేల విలీనంతో 77 సీట్లు ఉన్న బీజేపీని ఆర్జేడీ అధిగమించింది. ఈ విలీనం గురించి తెలియజేసేందుకు తేజస్వి యాదవ్ తన సొంత కారులో నలుగురు ఎమ్మెల్యేలను తీసుకుని స్పీకర్‌ను కలిసేందుకు వెళ్లారు. ఇక.. RJDలో చేరిన AIMIM ఎమ్మెల్యేల్లో మహ్మద్ ఇజార్ అర్ఫీ, షానవాజ్ ఆలం, రుకానుద్దీన్ అహ్మద్, అంజార్ నైమి ఉన్నారు. ఇప్పుడు AIMIMకి బిహార్‌లో ఒకే ఒక ఎమ్మెల్యే అయిన – అక్తరుల్ ఇమాన్ మిగిలాడు. అతను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు.
బిహార్ రాజకీయాలకు అర్థం ఏమిటి?
బిహార్‌లోని రాజకీయ నిపుణులు ఈ విలీనాన్ని విశ్లేషించే పనిలో పడ్డారు. జనతాదళ్-యునైటెడ్ (జెడి-యు) యొక్క మౌనం వీరి విలీనానికి ఆమోదం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ పరిణామాన్ని రాజకీయ కోణంలో పరిశీలిస్తే ఇక్కడ కూడా మహారాష్ట్రలో ఏర్పడ్డ పరిణామాలే ఉంటాయన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు బీజేపీ, జేడీయూ మధ్య చీలిక వస్తే.. అతిపెద్ద పార్టీ అయిన ఆర్జేడీని గవర్నర్ పిలవవలసి ఉంటుందని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ విలీనానికి రూపశిల్పి సీమాంచల్ ప్రాంతానికి చెందిన మనోజ్ ఝా అని ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. ఇంతకుముందు వీఐపీ పార్టీ చీలికతో ఆ పర్టీలోని ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో బిహార్‌లో ఆర్జేడీని వెనక్కి నెట్టి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక.. ఇప్పుడు AIMIM కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల విలీనంతో RJD తిరిగి రాష్ట్ర అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బిహార్ ఎన్నికల ఫలితాల తర్వాత జేడీయూ నిరంతరం విస్తరణ పర్వం కొనసాగిస్తోంది. స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ సింగ్, లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) శాసనసభ్యుడు రాజ్‌కుమార్ సింగ్, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) ఎమ్మెల్యే మహ్మద్ జమా ఖాన్‌లను ఆర్జేడీ తన గుప్పిట్లో పెట్టుకుంది. తాజా విలీనంతో బీజేపీ రెండో స్థానానికి చేరుకోవడంతో జేడీయూ శిబిరంలో ఒకవైపు సంతోషం.. మరోవైపు ఏమవుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.