Tuesday, November 26, 2024

26,200 వజ్రాలతో ఉంగ‌రం.. గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం ద‌రఖాస్తు

ఉంగ‌రం అంటే మ‌హా అయితే ఒక‌టో..రెండో వ‌జ్రాలు ఉండ‌టం మామూలే.కానీ ఇక్క‌డ మీరు చూస్తోన్న ఈ ఉంగ‌రంలో ఏకంగా 26,200వ‌జ్రాలు పొదిగి త‌యారు చేశారు.ఉత్త‌ర ప్ర‌దేశ్ మీర‌ట్ కి చెందిన డాజ్లింగ్ జ్యూయ‌ల‌రీ అనే ఆభ‌ర‌ణాల త‌యారీ సంస్థ ఈ ఉంగ‌రాన్ని త‌యారు చేసింది. దాంతో ప్రపంచంలోనే ఎక్కువ వజ్రాలు పొదిగి రూపొందించిన ఉంగరంగా ఇది రికార్డు నెలకొల్పబోతుంది. అత్యధిక వజ్రాలతో పువ్వు ఆకారంలో ఉన్న ఈ ఉంగరం చూపరులను ఆకట్టుకుంటుంది. డాజ్లింగ్ జ్యుయెలరీ సంస్థ యజమాని విపుల్‌ అగర్వాల్‌ ఈ ఉంగరానికి ‘దేవ్‌ ముద్రిక’ అని పేరు పెట్టారు.

ఇంతకుముందు దక్షిణాదికి చెందిన ఓ సంస్థ 24 వేల వజ్రాలను పొదిగి ఓ ఉంగరాన్ని తయారు చేసిందని విపుల్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇప్పటి వ‌ర‌కు అదే రికార్డుగా ఉందన్నారు. ఇప్పుడు తాము 26,200 వజ్రాలతో ఉంగరాన్ని సిద్ధం చేసి రికార్డుకు రెడీ అయ్యామని చెప్పారు.ఈ ఉంగరం డిజైన్‌ను మొదట సాఫ్ట్‌వేర్‌ ద్వారా రూపొందించామని, ఆ తర్వాత కళాకారులతో తయారు చేయించామని విపుల్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఈ ఉంగరం తయారీకి 8 నుంచి 10 మంది కళాకారులు మూడు నెలలపాటు కష్టపడ్డారని ఆయన చెప్పారు. దీన్ని రెండు వేళ్లకు పెట్టుకోవచ్చన్నారు. ఈ ఉంగరానికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం దరఖాస్తు చేశామని, రికార్డు కన్ఫమ్‌ అయిన తర్వాత ఉంగరం ధర నిర్ణయిస్తామని అగర్వాల్ వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement