Monday, November 25, 2024

శివ్​ రాజ్​ సింగ్​ ప్రభుత్వానిది ‘జుమ్లా’ నిర్ణయం అన్న మహిళా కమిషన్..

గృహ హింస కారణంగా వైకల్యంతో బాధపడుతున్న మహిళలకు ఆర్థిక సహాయం అందించాలనే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శోభా ఓజా. ఇది అసాధ్యం అని ఆమె గురువారం పేర్కొన్నారు. గృహ హింస కారణంగా వికలాంగులైన మహిళలకు ఆర్థిక సహాయం అందించే పథకానికి మధ్యప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో శోభా రియాక్ట్ అయ్యారు. ‘‘ఖాళీ ఖజానా ఉన్నప్పటికీ గృహ హింస కారణంగా దివ్యాంగులుగా (వికలాంగులు) మారిన మహిళలకు ఆర్థిక సహాయం అందించాలని శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జుమ్లా (తప్పుడు వాగ్దానం) తప్ప మరొకటి కాదు’’ అని ఓజా తెలిపారు. ‘‘ఇది పూర్తిగా అసాధ్యమైన నిర్ణయం. మరిచిపోయిన ఆ గాయాన్ని మరింత రెచ్చగొట్టడం లాంటిది’’ అని ఆమె అన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించలేకపోయిన రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని ఈ చర్య రుజువు చేస్తోందని మండిపడ్డారు.

మానసికంగా, శారీరకంగా హింసకు గురైన మహిళకు పరిహారం ఎంతమాత్రం సరిపోదని శోభా ఓజా అన్నారు. అలా కాకుండా మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పటిష్టమైన, సమర్థవంతమైన చర్యలు తీసుకుంటే బాగుండేదని ఆమె అన్నారు. 2020 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం మారినప్పటి నుండి న్యాయపరమైన వివాదంలో చిక్కుకోవడం ద్వారా మహిళా కమిషన్ తన విధులను నిర్వర్తించడానికి అనుమతించడం లేదని ఓజా విమర్శించారు. అయితే.. పథకం ప్రకారం 40 శాతం వైకల్యంతో బాధపడుతున్న మహిళలకు ₹ 2 లక్షలు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ₹ 4 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా చట్టపరమైన ప్రక్రియ జరుగుతున్నట్లయితే బాధిత మహిళల నివాసం నుండి కోర్టుకు రవాణా ఖర్చులను కూడా అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.

ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement