న్యూఢిల్లి , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి
భారత ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది. దేశం నుంచి బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై గురువారం నిషేదం విధించింది. ఈ నిషేధం ఇలా అమల్లోకొచ్చిందో లేదో అప్పుడే అమెరికా, యూరోప్ దేశాల్లో బియ్యం ధరలు అమాంతం పెరిగాయి. వాస్తవానికి ప్రస్తుతం రవాణా దశలో ఉన్న బియ్యం ఎగుమతులపై ప్రభుత్వం ఎలాంటి కట్టడి విధించలేదు. అయినా విదేశాల్లో స్థిరపడ్డ దక్షిణ భారతీయులు తమ ప్రధాన ఆహార మైన బియ్యాన్ని బస్తాల కొద్దీ కొనుగోలు చేసి నిల్వ పెట్టారు. దీంతో మార్కెట్లలో బియ్యం నిల్వలు అనూహ్యంగా పడిపోయాయి. ఇది ఆయా దేశాల్లో బియ్యం ధరల పెరుగుదలకు కారణమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు భారత్. ఈ ఏడాది దేశంలో వర్షాలు ఆలస్యంగా కురిశాయి. అలాగే కొన్నిచోట్ల అతి భారీవర్షాలు పడ్డాయి. ఈ నేపథ్యం లో దేశీయంగా బియ్యం దిగుమతులు తగ్గుతాయని కేంద్రం అంచనాలేసింది. గతకొన్నేళ్ళుగా దేశం నుంచి బియ్యం ఎగుమతులు విపరీతంగా పెరిగా యి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న బియ్యం ఎగుమతుల్లో భారత వాటా 40శాతంగా ఉంది. ఇక్కడ పేదరిక నిర్మూలన పథకాల క్రింద దేశవ్యాప్తం గా పేదలకు ఉచితంగా
ఇస్తున్న బియ్యాన్ని బ్లాక్మార్కెటీర్ల ద్వారా మిల్లర్లు సేకరిస్తున్నారు. కిలో 10నుంచి 15రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వీటికే సానబట్టి సూపర్పైన్ రకంగా తీర్చిదిద్ది ఎగుమతులు జరుపుతున్నారు. భారత్ నుంచి కిలో 50నుంచి 60రూపాయల ధరపై ఎగుమతి చేస్తున్నట్లు వీరు పేర్కొంటున్నారు. ఈ మేరకే వారు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగాయి.
అందుకనుగుణంగా భారతీయ మారకపు విలువలో కిలో రూ.130 వరకు వీరికి బియ్యంపై లభిస్తోంది. ప్రభుత్వానికి లెక్కల్లో చూపిన ధర పోగా మిగిలిన మొత్తాన్ని విదేశాల్లోని బ్యాంకుల్లో వీరు మదుపు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు దేశంలోని బియ్యం ఎగుమతిదార్లు, మిల్లర్లు వందలు, వేల కోట్లకు పడగలెత్తారు. రానున్న ఎన్నికల్లో వీరే ప్రజల్ని, పార్టీల్ని శాసించనున్నారు. విదేశాల్లో మదుపు చేసిన వందలు, వేల కోట్లను హవాలా రూపంలో భారత్కు తెచ్చి విచ్చలవిడిగా ఖర్చు చేసి తమకు అనుకూలమైన ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రయత్నించనున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన కేంద్రం అకస్మాత్తుగా ఎగుమతులపై నిషేధం విధించింది. భారత్లో గత 12మాసాల్లోనే బియ్యం ధరలు అనూహ్యంగా పెరిగాయి. గత మూడుమాసాల్లో 11.5శాతం ధరల పెరుగుదల నమోదైంది. గతేడాది 74లక్షల టన్నుల బియ్యాన్ని భారత్ నుంచి విదేశాలకు ఎగుమతులు జరిపారు. ఈ ప్రభావం కూడా బియ్యం రిటైల్ ధరలపై ప్రభావం చూపింది. కాగా ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం, ఎల్నినోల ప్రభావం గట్టిగా ఉంటుందని కేంద్రం అంచనాలేసింది. ముందస్తుగానే ఎగుమతులపై 20శాతం సుంకం విధించింది. అయినా ఎగుమతులు ఆగలేదు. దీంతో పూర్తిస్థాయిలో నిషేధం పెట్టేసింది.
భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడ్డారు. దక్షిణ భారతీయులు ఎక్కడికెళ్ళినా ప్రధాన ఆహారంగా వరినే తీసుకుంటారు. భారత్ నుంచి ఎగుమతయ్యే బియ్యంతో పోలిస్తే వియత్నాం నుంచి ఎగుమతయ్యే బియ్యం ధర అంతర్జాతీయ మార్కెట్లో అధికంగా ఉంటుంది. మరికొన్ని దేశాలు కూడా బియ్యం సరఫరా చేస్తున్నా వాటి నాణ్యత దక్షిణ భారతీయులు తినేందుకు సరిపోదు. ఈ నేపథ్యంలో కేవలం నిషేధంతోనే కేంద్రం సరిపెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కేంద్రమే బియ్యాన్ని ఎఫ్సీఐ లేదా ఎంఎంటీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రైతుల్నుంచి నేరుగా మంచి ధరపై సేకరించి అంతర్జాతీయ ధరలకనుగుణంగా విదేశాల్లోని భారతీయులకు ఎగుమతులు జరపాలి. తద్వారా క్షేత్రస్థాయిలో రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుంది. అలాగే మార్కెట్ ధరకనుగుణంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు లాభం చేకూరుతుంది. ఇది జాతి సంపదగా మారుతుంది. బియ్యం మాఫియాను కట్టడి చేసేం దుకు వీలౌతుంది. పేదరిక నిర్మూలన పథకాల క్రింద ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బియ్యం పక్కదారి పట్టకుండా నిరోధించేందుకు సహాయపడుతుందని వీరు పేర్కొంటున్నారు.