తెలంగాణ అంటే ఎన్నికల ముడిసరుకు కాదు.. తెలంగాణ అంటే ఓట్లు రాల్చే ఉన్మాదం కాదు.. తెలంగాణ అంటే ఓరుగల్లు పేరు వింటే సమ్మక్క సారమ్మ గుర్తొస్తరు.. ఓరుగల్లు పేరు వింటే అన్నపు రాశులు ఒకవైపు, ఆకలి కేకలు ఒకవైపు అన్న ప్రజాకవి కాళోజీ గుర్తొస్తరు.. దేశానికి దశ, దిశ తెచ్చిన దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు గుర్తొస్తరు. అట్లాంటిది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దేశానికి అన్నం పెడుతున్న రైతన్నల పక్షాన నిలబడుతోంది. అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో ఆయన రైతులకు ఎట్లాంటి సదుపాయాలు కల్పిస్తారన్న వివరాలు వెల్లడించారు..
రైతుల పక్షాన వరంగల్ డిక్లరేషన్ ప్రకటిస్తోందని, కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రెండు లక్షల రుణ మాఫీ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. భూమి కల రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి 15వేల సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు అయిన రైతు కూలీలకు ఏడాది 12వేల ఆర్థిక సాయాన్ని అందిస్తాం. పండించిన పంటలకు వరి, పత్తి, మిర్చి, పసుపు, చెరుకు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు కల్పించి.. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం.. తెలంగాణలో మూతపడ్డ చెరుకు కర్మాగారాలను తెరిపిస్తాం. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం.. చెరుకు, పసుపు రైతులకు భరోసాగా ఉంటా.. మెరుగైన పంటల బీమా పథకాన్ని తెస్తాం. ప్రకృతి విపత్తులు కానీ, మరో విధంగా కానీ, నష్టం జరిగితే వెంటనే నష్ట పరిహారం అందిస్తాం..
రైతు కూలీలు, భూమి లేని వారికి రైతు భీమా వర్తింపజేస్తాం.. రైతు కుటుంబాలను ఆదుకునేందుకు వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం చేస్తాం.. పోడు భూములు, అసైన్డ్ భూములు కేటాయించిన దళిత, గిరిజనులకు పూర్తి హక్కులు కల్పిస్తాం. రైతు పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ని రద్దు చేస్తాం. అన్ని వర్గాల ప్రజల భూములకు రక్షణ కల్పించేలా ఈ ప్రక్రియను సరళతరం చేస్తూ సరికొత్త రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి పేద వాడిని ఆదుకుంటాం… వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో నకిలీ విత్తనాల బెడదతో పంట నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
నకిలీ విత్తనాలు, పురుగు మందల అదుపు చేసేలా ప్రత్యేక చట్టం తెస్తాం. కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. నిర్ధిష్ట ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులు.. పాలమూరు, ఎస్ఎల్బీసీ వంటి వాటిని సత్వరమే పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం.
రైతుల హక్కులను చట్టపరమైన అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో భూముల స్వభావం, వాతావరణ పరిస్థులకు అనుకూలంగా పంట ప్రణాళికలను రూపొందించి వ్యవసాయాన్ని లాభసాటిగా, వ్యవసాయం అంటే పండుగలా మార్చేలా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, సోనియమ్మ రాజ్యంలో ఏ పంటను ఏ ధరకు కొనుగోలు చేస్తామో తెలియజేస్తున్నాం
ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పండిస్తున్న పంట వరిధాన్యం.. దీని ధర 19వందలు ఉంది.. దళారులు, మిల్లర్లు 12, 14 వందలకు కొంటున్నారు. 2500 క్వింటా వడ్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.
మొక్కజొన్న గిట్టుబాటు లేక రైతులు చనిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే 2200 మక్కల కొనుగోలు చేస్తాం
కందులను 6700 కనీస మద్దతు ధరకు కొంటాం..
పత్తి 6500కు గిట్టుబాటు కల్పిస్తాం..
మిర్చి 15వేలకు క్వింటాల్ కొంటాం
పసుపు బోర్డు ఏర్పాటు చేసి 12వేలకు క్వింటాల్
ఎర్రజొన్న 3050
చెరుకు 4వేలు క్వింటాకు కొనుగోలు చేస్తామని రేవంత్ రెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్నారు.