Wednesday, November 20, 2024

Spl Story: రివ్యూ అంటే ఇట్లుండాలే.. ఆలోచించకుండా యువత మొదళ్లను ఛిద్రం చేస్తున్న సినిమాలు

కరోనాని కష్టాలను అధిగమించి.. ఈ ప్రభుత్వాలు వేస్తున్న సెస్​లు, ఫైన్​లు, ట్యాక్సుల నుంచి ఎట్లా బయటపడాలా అని అందరం ఆలోచిస్తుంటే.. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు మాత్రం జనాల నుంచి ఎట్లా డబ్బులు దండుకోవాలా అన్నట్టుగా ఉన్నాయి. సినిమా మాధ్యమం అంటే.. జనాలను ఎంటర్​టైన్​ చేయడంతోపాటు సందేశాత్మకంగా ఉండాలి. యువతను పెడదోవ పట్టించకుండా, సమాజాన్ని మంచి మార్గంలో చూపించాలి.. కానీ కొన్ని సినిమాలు మాత్రం వక్రీకరణలు చేస్తూ.. ఈతరం యువతకు ఒక అల్లూరి, ఒక కుమ్రం భీమ్​ ఎవరో తెలియకుండా కాల్పనిక కథలతో వారి మొదళ్లపై చెడు ప్రభావాన్ని రేకెత్తిస్తున్నాయి. అంతేకాకుండా గంధం చెక్కల దొంగ వీరప్పన్​ వంటి వ్యక్తిని గొప్పగా చిత్రీకరించి సమాజాన్ని పెడదోవన పడేస్తున్నాయి. తప్పుడు పనులు చేస్తూ నీ యవ్వ తగ్గేదేలా అంటూ యువతను మంచి ఏంటో, చెడు ఏంటో ఆలోచించకుండా తప్పుడు పనులను కరెక్ట్​ అనేలా చేస్తున్నాయి.. అయితే. సినిమా రివ్యూలు ఎలా ఉన్నా.. ఈ రివ్యూ మాత్రం అందరూ చదవి తీరాల్సిందే..

తల్లిదండ్రుల సంపాదన మీద అడ్డగోలుగా పెరిగిన శరీరంలో.. సహజంగా ఊరే హార్మోనులు ఏదైనా చేయమని పోరుపెడతాయి. అటు శరీర కష్టం, ఇటు మేధో కష్టం తెలియని యువతకి ఏం చేయాలో తెలియదు. ఎలా చేయాలో తెలియదు. ఈ తెలియని తనం న్యూనతాభావాన్ని సృష్టిస్తుంది. దాన్ని కప్పిపుచ్చడానికి ఆధిక్యత ప్రదర్శిస్తూ ఉండాలి. (ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో బాధపడేవాళ్లే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సుపీరియారిటీ కాంప్లెక్స్ ప్రదర్శిస్తారని ఎరిక్ఎరిక్‌సన్ ప్రతిపాదన ఈ సందర్భంగా మీకు గుర్తుచేస్తున్నాం).

తానొక గొప్పకార్యం చేస్తున్నట్లు భ్రమిత ప్రపంచం ఏర్పరచుకొని అందులో తాను హీరోగా, మిగతా అననుకూల పరిస్థితులను శత్రువులుగా ఏర్పరచుకొని వాటిమీద పోరాటం చేసే మహాయోధుడిగా కలలు కనే ఒక మాయా ప్రపంచాన్ని ఏర్పరచుకుంటాడు. ఈ యువతని శివాజీ జయంతులూ, హనుమాన్ శోభాయాత్రలకు, మతాలు, రాజకీయపార్టీలు వాడుకుంటాయి. పబ్జీ, ఫ్రీఫైర్ గేమింగ్‌లు ఆడిస్తూ ఆన్లైన్లో డబ్బు సంపాదించుకుటారు కొందరు. ఇదే వరుసలో సిగరెట్లు, లిక్కర్, డ్రగ్స్ వ్యాపారాలు. ఇక నిత్యజీవితంలో పగ, ద్వేషం, ప్రతీకారం చూపించి రెచ్చ గొట్టడానికి రిజర్వేషన్లూ, ముస్లిం మతం, క్రైస్తవమతం అంటూ నచ్చని విషయాలమీద ఎక్కడపడితే అక్కడ విషం చిమ్మడానికి ఉన్నాయి. ఇదే ఒరవడిలో పుష్ప, సాహో, ట్రిపులార్, కేజీఎఫ్2 వంటి సినిమాలు.

అయితే.. ఈ సినిమాలు యథాతధంగా తీసి అమ్ముకునే వాళ్లూ కొన్ని నైతిక విలువల ముసుగేస్తారు. ఉదాహరణకు పశు బలమ్మీద ఆధారపడే బాహుబలికి అలగాజనమ్మీద ప్రేమ ఉంటుంది. దొంగల ముఠా నాయకుడు సాహోకి తండ్రిని చంపినవారి మీద పగ, ఎర్రచందనం స్మగ్లరైన పుష్పకి స్త్రీ మానమ్మీద గౌరవం, ట్రిపులార్ తన్నులాటగాళ్ల వెనకాల దేశభక్తి, చిన్న దోపిడీదార్లని చంపి అందరికన్న పెద్ద డాన్‌గా ఎదిగే కేజీఎఫ్ నాయకుడు తల్లికిచ్చినమాట కోసం అన్ని వ్యవస్థల్ని సముద్రంలో ముంచగలడు!

ప్రస్తుతానికి ఇప్పటి కేజీఎఫ్‌కి పరిమితం చేసి మాట్లాడుకుంటే, ఒక బుర్రతక్కువ మూర్ఖపు తల్లి ఆశయాలకోసం నేలమీద ఉన్న బంగారం తవ్వి సముద్రంలో పారబోసే క్రమంలో ఒక వ్యక్తి తన పశుబలాన్ని ఉపయోగించడమే ఈ సినిమా. నిజానికి ఇదివరకే యువత ఎడిక్ట్ అయిన పబ్జీ, ఫ్రీఫైర్ వంటి ఆన్లైన్ గేములకు ఎక్స్‌టెన్షన్ గా దీన్ని చూడొచ్చు. మొబైల్ ఫోన్లలో చూసే ఈ పశుబలాన్ని, ఆధిపత్య ప్రదర్శనని, అర్థంలేని పోరాటాన్ని మొబైల్ ఫోన్లు, లాప్టాప్ తెర నుండి పెంచి పెద్దచేసి పెద్దదైన సినిమా తెరమీద ప్రదర్శించడమే కేజీఎఫ్​2.

- Advertisement -

భర్త నిరాదరణ వల్లా, తనకున్న రోగం వల్లా ఇబ్బందిపడుతూ.. ఆకోపాన్ని, అర్థంలేని ఆవేశాన్ని, ఎదుటివాళ్లని ద్వేషించే, ధ్వంసంచేసే డైలాగులు చెబుతూ, పొలాల్లో పనిచేయకుండా, ఇగో చూపిస్తూ పాటలు పాడే ఒక తల్లి పెంచిన కొడుకు మన హీరోగారు. తన తల్లికి బంగారమంటే ఇష్టమని, అందరికీ కూడా ఇష్టమని, అది సముద్రంలో ఉండడంవల్ల సముద్రం మెరుస్తూ ఉంటుందని తల్లి చెప్పే మాటలు నమ్మి, ముందు బంగారు గనుల మీద అప్పటికే అధికారం సంపాదించిన ఒక శక్తివంతమైన ముఠా, మరో మాటలో దేశాన్ని పాలించే ప్రధాని అధీనంలోని వ్యవస్థల్ని కేవలం తన కండ బలంతో కేవలం కొన్ని నెలల్లోనే అధీనంలోకి తెచ్చుకొని రెండేళ్లలో ఆ గనుల్ని మొత్తం తవ్వించి ఆ బంగారాన్ని తీసుకెళ్లి సముద్రంలో కలుపుతూ తానూ చావడం సినిమా కథ.

ఇక కథనం విషయానికొస్తే.. దాని ప్రదర్శన.. చెప్పడానికి ఏమీలేదు, మొదటి సినిమా కాస్త నయమనిపిస్తే దాని సీక్వెల్ అయిన రెండో దాన్లో దాన్ని కొనసాగించడానికి ఏమీ మిగలక కేవలం సినిమా మధ్యలో కరెంటు పోయినట్లు బ్రేకులిస్తూ చేసిన ఎడిటింగ్.. మీ చెవుల్నీ, కళ్లనీ మొత్తానికి తలకాయని గోడకేసి ఫెడీఫెడీమని బాదుతాయి. ఇదే నిజం.. మన హీరో ఈ సారి దేశం దాటి వెళ్తాడు. అక్కడ ఎంతటి శక్తివంతుడినైనా బెదిరిస్తాడు. దేశం వచ్చి ప్రధానినీ బెదిరిస్తాడు. దిగుమతి చేసుకున్న అతిపెద్ద తుపాకీని పరీక్షించడానికి పోలీస్‌స్టేషన్ల ముందు వరుసగా పెట్టిన పోలీసుల జీపులనూ వాడుకుంటాడు.

మన సగటు యువత కోసం హీరో సిగరెట్, మందు.. కంపెనీ కోసం అమ్మాయిని వాడుకుంటూ ఉంటాడు. ప్రతి వెధవనీ ప్రేమించడానికి ప్రతి కొంపలో దొరికే ఒక్కే వ్యక్తి అయిన అమ్మ అనే పాత్రని ఇందులోనూ సమర్థవంతంగా వాడుకుంటాడు. మెరిట్‌ మీదా, బంధుప్రీతి మీదా, రిజర్వేషన్ల మీదా డైలాగులు కొట్టి మనవాళ్లని ఉత్తేజపరుస్తాడు. కేవలం దున్నపోతులాగా కండలూ, ఎత్తుతో, ఉన్మాదంలో ఊగుతూ, మోటర్‌సైకిళ్ల మీద ఊరేగుతూ, సగం చదువు ఇంగ్లిష్ వాడుతూ.. మన యువకులని తనలో చూసుకొమ్మని ఊరిస్తాడు. వాళ్ల చేత వీడు చేసే అర్థంలేని, వాస్తవంలో జరగని పనులకి పూనకాలు తెప్పిస్తాడు.

జాగ్రత్త!
ఈ సినిమాలు అత్యంత్ర ప్రమాదంగా ఒక తరాన్ని తయారు చేస్తున్నాయి. ప్రేమ, దయ, అవగాహన, బాధ్యత, చదువు, నైపుణ్యాలు, ఆలోచన, కష్టించే అంకితభావం లేకుండా కేవలం ద్వేషమ్మీద పెరిగి పెద్దదయ్యే ఒక వర్గం సమాజంలో తయారవుతోంది. రేపు అతి ప్రమాదంగా ఇది రూపొందుతుంది.

అఫ్‌కోర్స్ ఇలా ఎదిగిన యువత ఏమీ సాధించలేదు, ఎందుకంటే మనం అనుభవిస్తున్నది సినిమా కాదు, వాస్తవ జీవితం. ఇది పోలీసు స్టేషన్లలో మోకాళ్లమీద కూర్చోవడానికీ, జైళ్ళలో వూచలు లెక్కపెట్టడానికీ, పోలీసులకు ఎన్‌కౌంటర్ పేరుతో షూటింగ్ ప్రాక్టీసులకీ, పరస్పర హత్యలకీ పనికొస్తుంది.

(ఫైనల్​గా: అతిపెద్ద ఉరితాడు మోసుకెళ్తూ హీరో, వెనకాల తమ ఉరితాళ్తతో అభిమాన బానిస యువత)

Courtesy n credits : Siddharthi Subhas Chandrabose

Advertisement

తాజా వార్తలు

Advertisement