Friday, November 22, 2024

బ్లాక్ లిస్ట్ కంపెనీకి ఓఆర్ఆర్ గ‌ ‘లీజు’ – రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఔటర్‌ రింగ్‌ రోడ్డు టెండర్ల వెనక వేల కోట్ల రూపాయిలు చేతులు మారాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఓఆర్‌ఆర్‌కు ఏడాదికి రూ.700 కోట్ల ఆదాయం వస్తుం దని, ఈ లెక్కన 30 ఏళ్లలో దాదాపు రూ.22 వేల కోట్ల ఆదాయం వస్తుందని, అలాంటిది రూ.7,380 కోట్లకు ఎలా కట్టబెడతారని ఆయన ప్రశ్నించారు. ఈ ఓఆర్‌ఆర్‌ టెండర్‌ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ… విశాఖ ఉక్కును కొంటామన్న కేసీఆర్‌… తెలంగాణ ప్రజల ఆస్తిని ప్రయి వేటుకు ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలన్నారు. ఐఆర్బీ సంస్థను ముందు పెట్టి ఫైనాన్సియల్‌ ఇన్విస్ట్‌మెంట్‌తో మంత్రి కేటీఆర్‌ మిత్రులు ఈ సంస్థలోకి వస్తారని, తద్వారా కేటీఆర్‌ చేతిలోకి వస్తుందని ఆయన ఆరోపించారు. కేటీఆర్‌ అమెరికాలో స్థిరపడినా, కేసీఆర్‌ ఫామ్‌ హౌజ్‌లో సేద తీరినా నెలకు రూ.100 కోట్ల ఆదాయం వచ్చే విధంగా ఓఆర్‌ఆర్‌ను వినియోగించుకునే ప్రయత్నంలో ఉన్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

”ఓఆర్‌ఆర్‌పై 2006లో ప్రభుత్వం తీసుకున్న రూ.6, 696 కోట్ల రుణం గతేడాది మార్చి 31తో తీరిపోయింది. ఇప్పుడు ఓఆర్‌ఆర్‌పై రుణం లేదు. ఇప్పుడు ఏ రకంగా చూసిన ఆదాయమే వస్తుంది. ఏడాదికి రూ.700 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఈ లెక్కన 30 ఏళ్లలో ప్రభుత్వానికి రూ.21 వేల కోట్ల నుంచి 22 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. 30 ఏళ్ల ఆదాయం తనఖా పెడితే.. వచ్చే ఆదాయంలో ఏ బ్యాంకు అయినా 70శాతం మేర అంటే దాదాపుగా రూ.15 వేల కోట్ల మేరు రుణం ఇస్తుంది. 48 గంటల్లో రుణం ఇప్పించేందుకు నేను కృషి చేస్తాను. 3 నెలల్లో మీ ప్రభుత్వం పో తుంది, అలాంటిది ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్లకు లీజు ఎలా ఇస్తుంది. ఓఆర్‌ఆర్‌ టెండర్లను రద్దు చేసి స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో బేస్‌ ప్రైస్‌ రూ.7,388 కోట్లతో కొత్త టెండర్లను ఆహ్వానించాలి” అని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

మంత్రి కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదు..
ఓఆర్‌ఆర్‌పై ఇంత రాద్ధాంతం జరుగుతుంటే మంత్రి కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని, ఆయన మౌనం వెనక మర్మమేమిటో చెప్పాలని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ అంశంలో ఇరుక్కుపోతాననే భయంతో కేటీఆర్‌ ముఖం చాటేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ”బిడ్‌ నిర్వహణ ఎన్‌హెచ్‌ఏఐ ( నేషనల్‌ హైవేస్‌ అథారిటి ఆఫ్‌ ఇండియా) నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా జరిగిందని మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ చెప్పారు. ఈ ఓఆర్‌ఆర్‌ టెండర్ల విషయంలో ఎన్‌హెచ్‌ఏఐ అభ్యంతరాలను ప్రభు త్వం పట్టించుకోలేదు. హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌ 2031తో ముగు స్తుంది. 30 ఏళ్లకు లీజుకు ఇస్తే.. 2031 తర్వాత మాస్టర్‌ ప్లాన్‌ మారు తుంది. దాంతో సమస్యలు వస్తాయి. అంతేకాకుండా దేశంలో ఏ రహ దారి టెండరైనా 15 నుంచి 20 ఏళ్లకు మించి ఇవ్వలేదు. 30 ఏళ్ల సుదీర్ఘ కాలానికి కాకుండా 15 నుంచి 20ఏళ్ల వరకే ఉండాలని ఎన్‌హెచ్‌ఏఐ సూచించింది. అయినా ఓఆర్‌ఆర్‌ను ఏకంగా 30ఏళ్లకు కట్టబెట్టడంలో ఆంతర్యమేమిటీ..? ఈ విషయంలో ఎన్‌హెచ్‌ఏఐ అభ్యంతరాలను ఎందుకు పట్టించుకోలేదు” అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

హెచ్‌ఎండీఏ నుంచి సంతోష్‌ను మార్చి బీఎల్‌ఎన్‌రెడ్డిని నియమించడంలో ఆంతర్యమేమిటీ..?
ఓఆర్‌ఆర్‌ కారిడార్‌ టెండర్‌ పిలవడానికి ముందు.. హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ పరిధిలో ఉండేదని, ఈ టెండర్ల మధ్యలోనే ఓఆర్‌ఆర్‌ను హెచ్‌ఎండీఏకు బదిలీ చేశారని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే హెచ్‌ఎండీఏ ఎండీగా ఉన్న సంతోష్‌ను మార్చి రిటైర్డ్‌ అయిన బీఎల్‌ఎన్‌ రెడ్డిని నియమించడం ఆ వ్యవహారాన్ని పూర్తి చేశారని ఆయన పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్‌ను ఐఆర్బీకి కట్టబెట్టేందుకే హెచ్‌ఎండీఏలోకి మార్చడం నిజం కాదా..? అందుకు సంతోష్‌ను మార్చి బీఎల్‌ఎన్‌ రెడ్డిని నియమించడం వెనక కారణం కూడా ఇదే కదా..? అని రేవంత్‌రెడ్డి నిలదీశారు. ఐఆర్బీ సంస్థ బిడ్‌లో రూ.7,272 కోట్లు మాత్రమే దాఖలు చేస్తే .. టెండర్‌ వివరాలు ప్రకటించే నాటికి ఆది రూ.7,380 కోట్లకు ఎలా మారిందన్నారు. గ్రీనరీ నిర్వహణ ఖర్చు ఏడాదికి రూ.40 కోట్లు అంటే 30 ఏళ్లకు రూ.1,200 కోట్లు అవు తుందని, ఈ లెక్కన ఐఆర్బీకి రూ.6 వేల కోట్లకే టెండర్‌ ఇచ్చినట్లుగానే స్పష్టమవుతోందన్నారు. మాజర్‌ సంస్థ నివేదిక ప్రకారమే టెండర్లు ఇచ్చామని ఆర్వింద్‌కుమార్‌ చెబుతున్నారని, కానీ ఆ మాజర్‌ సంస్థపై విదేశాల్లో కేసులు నమోదైన విషయాన్ని ఎందుకు చెప్పడం లేదని ఆయన నిలదీశారు. ఐఆర్బీ సంస్థపై క్రిమినల్‌ కేసులున్నాయని, టోల్‌ నిర్వహణకు సంబంధించి రోజుకు రూ.87 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ.60 లక్షలు మాత్రమే చెల్లిస్తోందని, దీంతో డిపాజిట్‌గా ఉన్న రూ.25 కోట్లు సీజ్‌ చేసి ఆ కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టింది వాస్తవం కాదా..? అలాంటి సంస్థకు ఓఆర్‌ఆర్‌ టెండర్‌ కట్ట బెట్టడం వెనక ఆంతర్యమేమిటనీ ఆయన ప్రశ్నించారు. వీటన్నింటిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement