Friday, November 22, 2024

బంగారు బాతుని తెగ‌న‌మ్మారు – ఓ ఆర్ ఆర్ లీజ్ పై రేవంత్ గ‌రం గ‌రం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నూతన సచివాలయానికి వెళ్లకుండా టెలిపోన్‌ భవన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సచివాలయం వద్ద పోలీసులు, రేవంత్‌ మధ్య వాగ్వాదం, ఉద్రిక్తత నెల కొన్నది. పార్లమెంట్‌ సభ్యుడిగా సచివాలయానికి వెళ్లితే అభ్యంతరమేంటనీ ఆయన మండపడ్డారు. ఎంపీగా తనను, కార్లను రోడ్డుపైనే అడ్డుకోడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు టెండర్‌లో జరిగిన అక్రమాలపై మునిసిపల్‌, హెచ్‌ఎండీ ఏ అధికారులను సమాచార హక్కు కింద దరఖాస్తు చేయ డానికి వెళ్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలపగా.. అధికారులను కలిపేందుకు అపాయింట్‌మెంట్‌ లేదని పోలీసులు పేర్కొ న్నారు. ఆ తర్వాత మసబ్‌ట్యాంక్‌లోని మున్సిపల్‌ అడ్మిని స్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయంలోని సెక్షన్‌ ఆఫీసర్‌కు ఔటర్‌రింగ్‌రోడ్డు టెండర్‌ సంబంధించి పూర్తి వివరాలు కావాలని
ఆర్టీఐ కింద దరఖాస్తును రేవంత్‌రెడ్డి అందజేశారు. ‘ ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌ లిమెటెడ్‌కు ఇచ్చిన టెండర్లకు సంబంధించిన సమాచారం. టెండర్ల ప్రక్రియలో పాల్గొన్న కంపెనీలు, టెక్నికల్‌ బిడ్‌లో అర్హత సాధించిన కంపెనీల వివరాలు ‘ తెలుపాలని రేవంత్‌రెడ్డి కోరారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఔటర్‌ రిండ్‌రోడ్డు టెండర్‌లో జరిగిన అవినీతి బయటపడుతుందనే ప్రభుత్వం తనను పోలీసులతో అడ్డుకుంటోందని విమర్శించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ కలిసి ఓఆర్‌ఆర్‌ను తెగనమ్ముకున్నారని ఆయన మండిపడ్డారు. మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను తానొక్కడినే వెళ్లి కలుస్తానంటే పోలీసులకు అభ్యంతరమేంటో ఆర్థం కావడం లేదని, రోడ్డుపైనే తనను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. పోలీసు వాహనంలో తీసుకెళ్లి.. తిరిగి తీసుకురమ్మని చెప్పినా అయినా పోలీసులు ఒప్పుకోలేదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ మహానగరానికి మణిహారంగా అనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ను నిర్మించంది. భవిష్యత్‌ తరాలకు వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చాలని, అభివృద్ధిని అందించాలని ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి రూ. 6,696 కోట్లు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఖర్చు చేసింది. ఖర్చు చేసిన డబ్బులను తిరిగి రాబట్టుకోవడానికి టోల్‌ విధానం ప్రభుత్వం తీసుకొచ్చింది. హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసి టోల్‌ వసూలుకు అనుమతి ఇచ్చింది. ప్రతి ఏటా ప్రభుత్వానికి టోల్‌ ఆదాయం రూ. 750 కోట్లు వస్తోంది. ఆలాంటి ఆదాయం ఉన్న ఓర్‌ఆర్‌ను ముంబాయికి చెందిన ఎల్‌ఆర్‌బీ సంస్థకు 30 ఏళ్ల వరకు రూ. 7,388 కోట్లకే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టబెట్టింది. ప్రస్తుతం ఏడాదికి రూ. 750 కోట్ల ఆదాయం వస్తుంటే.. ముంబాయి చెందిన సంస్థకు కేవలం రూ. 246 కోట్లకే ఎలా కట్టబెడుతారు. బంగారు బాతుగా ఉన్న ఓఆర్‌ఆర్‌ను మంత్రి కేటీఆర్‌ 30 ఏళ్ల వరకు తెగనమ్మడమేంటీ..? ఆరు నెలల్లో దిగిపోయే ముందు ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ను అమ్ముతున్నారు ‘ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. అంబేద్కర్‌ పేరుతో ఉన్న కొత్త సచివాలయం నుంచి పరిపాలన సాగుతోందని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు అంబేద్కర్‌ సిద్దాంతాన్నే 24 గంటలు గడవక ముందే పూర్తిగా పక్కనపడేశారని ఆయన పేర్కొన్నారు. గత 20 ఏళ్లలో సచివాలయంలోకి వెళ్లకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎప్పుడు కూడా పోలీసులు అడ్డుకోలేదని, ఇప్పుడెందుకు అడ్డుకుంటున్నారో ఆర్థం కావడం లేదన్నారు.

కేటీఆర్‌ను జైల్లో పెట్టే వరకు పోరాడుతాం..
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని బొంద పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు. లక్ష కోట్ల విలువైన ఓఆర్‌ఆర్‌ను వేల కోట్లకే అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. ఈ దోపిడీ వెనుక కేసీఆర్‌, కేటీఆర్‌లు ఉన్నారని, వీటిపైన విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. మంత్రి కేటీఆర్‌ను జైల్లో పెట్టే వరకు పోరాటం ఆగదన్నారు. పరిపాలన భవనంలోకి ఒక ఎంపీగా తనకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కిలోమీటర్‌ దూరంలోనే తనను అడ్డుకున్నారని, కనీసం గేట్‌ వద్దకు కూడా రానీయలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మొత్తం టెండర్లపై విచారణ జరిపిస్తామని, ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement