హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. నాయకుల మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. సీనియర్లు ఒక వైపు.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఆయన అనుచరులు మరొక వైపు అనే విధంగా కాంగ్రెస్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. పార్టీలో సీనియర్లుకు సరైన గౌవరం దక్కడం లేదని, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు సీనియర్లు ఆరోపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను పీఏసీలో చర్చించకుండానే నిర్ణయాలు ప్రకటిస్తున్నారని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్యం ఠాగూర్‌తో పాటు ఏఐసీసీ ఇన్‌చార్జీ కార్యదర్శులు కూడా పట్టించుకోవడం లేదని పలువురు సీనియర్లు మొదటి నుంచి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడది మరింత ఎక్కువై పార్టీలో రేవంత్‌రెడ్డి, సీనియర్ నాయకుల మధ్య వివాదం చిలికి చిలికి గాలి వానలా మారి.. కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయే పరిస్థితి ఏర్పడింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీతో గట్టిగా కొట్లాడాల్సిన సమయంలో సొంత పార్టీలోని పంచాయతీలు తలనొప్పిగా మారాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య సఖ్యత తీసుకురావడం అటుంచితే.. విభేదాలను పరిష్కరించే పనిచేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ అంటేనే స్వపక్షంలో విపక్షం..
కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వపక్షంలో విపక్షం ఎప్పుడూ ఉంటుంది. అధికారంలో ఉన్నా.. ప్రతిప్రపక్షంలో ఉన్నా.. నాయకుల్లో ఒకరంటే మరొకరికి గిట్టదు. ఇదేంటని అంటే కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని వారే చెప్పుకుంటారు. కలహాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, హెచ్చరికలు ఎప్పుడూ ఉంటాయి. ఆ పార్టీలో సాధారణ కార్యకర్త కూడా అధినేతపై విమర్శలు చేయడం, అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం సర్వ సాధారణంగానే జరుగుతుంటాయి. ఈ ఆనవాయితీ మొదటి నుంచి కొనసాగుతోంది. ఇప్పుడది తెలంగాణ కాంగ్రెస్‌లో మరింత ఎక్కువైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా కొంత మంది సీనియర్లు జట్టు కట్టారు. పార్టీ కార్యక్రమాలు చెప్పకుండానే ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని, ఢిల్లిd పెద్దలను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన విషయం తెలిసిందే. మొదటిసారి పీసీసీ మాజీ అధ్యుక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రెండోసారి మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో కాగా.. ఆదివారం ఓ ప్రయివేట్ హోటల్‌లో జరిగింది. వరుసగా జరుగుతున్న సీనియర్ల భేటీ పార్టీలో మరింత దుమారాన్నే లేపింది. చివరకు పార్టీ హై కమాండ్ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాయత్వంపైన అసంతృప్తితో పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పార్టీ సీనియర్లు కమలాకర్‌రావు, శ్యామ్‌మోహన్ తదితరులు ఆదివారం నగరంలోని ఒక ప్రయివేట్ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ విషయం పార్టీ అధిష్టానానికి రేవంత్‌రెడ్డి వర్గీయులు తెలియజేయడంతో.. పార్టీ ఇన్‌చార్జ్ కార్యదర్శి బోసు రాజు రంగంలోకి దిగి పార్టీకి నష్టం చేసే విధంగా ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవద్దని, సమస్యలుంటే సోనియా, రాహుల్‌గాంధీలకు చెప్పుకోవాలని సీనియర్లకు ఫోన్లు చేశారు. తమ సమావేశం పార్టీకి వ్యతిరేకం కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఎలా బలోపేతం చేసుకోవాలనే చర్చించుకునేందుకు సమావేశం అవుతున్నట్లు సమాధానమిచ్చారు.
సీనియర్లను బయటికి పంపే కుట్ర జరుగుతోంది..
సీనియర్లను పార్టీ నుంచి బయటికి పంపే కుట్ర జరుగుతోందని ఆదివారం జరిగిన సమావేశం నాయకులు అభిప్రాయపడినట్లుగా తెలిసింది. ఒక్కొక్కరిని బయటికి పంపి పార్టీని కొంత మంది కబ్జా చేయాలని చూస్తున్నారని, పార్టీలోని ఏకపక్ష నిర్ణయాల వల్ల నష్టం జరిగే ప్రమాదం ఉందని చర్చించుకున్నారు. ఈ సమావేశానికి కొంత మంది సీనియర్లు గైర్హాజర్ కావడం, సమావేశం వాయిదా వేసుకుని సమస్యను అధిష్టానానికి చెప్పుకోవాలని సూచనలు చేయడంతో సమావేశాన్ని తొందరగానే ముగించుకున్నారు.
టీఆర్‌ఎస్ కనుసన్నల్లోనే సమావేశాలంటున్న రేవంత్ వర్గం..
పార్టీ సీనియర్ల సమావేశాలు టీఆర్‌ఎస్ నేతల ఆదేశాలు, సూచనల మేరకే జరుగుతున్నాయని, ఈ సమావేశాల కంటే ముందు మంత్రి హరీష్‌రావును సీనియర్ నేత వీహెచ్ కలిశారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. కొత్త పీసీసీ వచ్చాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం, ప్రజాదరణ పెరిగిందని, అందుకే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శలు చేస్తున్నారు. పార్టీకి నష్టం చేసే వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కోవర్టు, కుట్ర రాజకీయాలు నా వద్ద ఉండవు: వీహెచ్
పార్టీకి లాయలిస్టుగా ఉండే వారిలో తాను మొదటగా ఉంటానని, కోవర్టు, కుట్ర రాజకీయాలు ఉండవని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి ఎంత వరకైనా సిద్ధంగా ఉంటానని అన్నారు. తన కూతురుకు సంబంధించిన ఒక అంశంపై మంత్రి హరీష్‌రావు దగ్గరకు వెళ్లి మాట్లాడానని, అది కూడా ఉదయం 9 గంటల సమయంలో అందరుండగానే వెళ్లినట్లు తెలిపారు. చీకట్లో కలవడం, చీకటి దందాలు చేయడం తన నైజం కాదని, ఇది రాష్ట్ర ప్రజలకే కాకుండా పార్టీలోని సీనియర్లందరికి తెలుసుని వీహెచ్ పేర్కొన్నారు.