Friday, November 22, 2024

రేవంత్ ఇప్పుడే సీఎం అయిపోయారా?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్న వేళ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. రేవంత్ ప్రమాణస్వీకారాన్ని ఘనంగా జరుపుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ప్రమాణస్వీకారం ముఖ్యమంత్రి ఎన్నికైనంత హాడావిడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఏమాత్రం తీసిపోని రీతిలో రేవంత్ పట్టాభిషేకం జరిగింది. అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.

రేవంత్‌కు పీసీసీ పగ్గాలు ఇవ్వడంతో యువతలో జోష్ పెరిగింది అనేది వాస్తవం. ఉమ్మడి రాష్ట్రంలో కళకళ లాడిన కాంగ్రెస్.. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో పార్టీ పూర్తిగా గాడి తప్పింది. అంతర్గత విభేదాలు, గ్రూప్ రాజకీయాలు, వరుసగా ఎదురైన ఓటములతో కాంగ్రెస్ శ్రేణులు నిరాశతో డీలా పడ్డారు. ఇన్నాళ్లకు కాంగ్రెస్ పార్టీలో మళ్లీ జోష్ కనిపిస్తోంది. రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం వస్తుందన్న ధీమాలో హస్తం నేతలు ఉన్నారు. తెలంగాణ రాజకీయం నిన్నటి దాకా ఒక ఎత్తు… ఇప్పటి నుంచి మరొక ఎత్తు అని సవాల్ విసురుతున్నారు.

మరోవైపు టీ.పీసీసీ అధ్యక్ష పదవికే ఇంత హంగు ఆర్భాటాలా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ ఇప్పుడే సీఎం అయిపోయినట్లు కలలు కంటున్నారని ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. అయితే, ఎవరెన్ని విమర్శలు చేసినా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం తగ్గేదే లే అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్‌ను చూడబోతున్నామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్ పీసీపీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అనుమతులు లేవన్న కారణంతో జీహెచ్ఎంసీ అధికారులు వాటిని తొలగించారు. దీంతో రేవంత్ అభిమానులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల ఫ్లెక్సీల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించే అధికారులు.. ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నేత ఫ్లెక్సీలు తొలగిస్తున్నారని మండిపడ్డారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. టీ.పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఏపీలోని రేవంత్ అభిమానులు ఫ్లెక్సీలతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో రేవంత్ అభిమానులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఎంపిక రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి జోష్ నింపింది.

- Advertisement -

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లో రేవంత్ జోష్..

Advertisement

తాజా వార్తలు

Advertisement