తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. కొడంగల్‌లో కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు చేసి కాంగ్రెస్ పార్టీని ఓడించారని రేవంత్ ఆరోపించారు. కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడిపిస్తే తన అక్రమాలను కొనసాగించవచ్చని కేసీఆర్ ఆనాడు తనను ఓడించారన్నారు. తనను గెలిపించి అక్కున్న చేర్చుకున్న మల్కాజిగిరి ప్రజలకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని ప్రశ్నించారు. తనను గెలిపించిన మల్కాజిగిరి ప్రజల వల్లే తనకు పీసీసీ పదవీ వచ్చిందన్నారు. మూడుచింతలపల్లి, కేశవపూర్, లక్ష్మాపూర్ గ్రామాలను కేసీఆర్ దత్తత తీసుకున్నారన్నారు. సీఎం ఫామ్ హౌస్‌కు వెళ్లడానికే ఈ మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారని రేవంత్ మండిపడ్డారు. కొంత మంది సన్నాసులు అభివృద్ధి చేసినట్లు ఫ్లెక్సీలు పెట్టారని ఆరోపించారు.
కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతోనే అభివృద్ధి అనిపిస్తే.. దమ్ముంటే ఈ మూడు గ్రామాలలో తిరగడానికి టీఆర్ఎస్ నేతలు ముందుకు రావాలన్నారు. ప్రజలు కర్రు కాల్చి వాత ఎవరికి పెడతారో చూద్దామన్నారు.
సీఎం దత్తత తీసుకున్న లక్ష్మాపూర్ గ్రామం ధరణి వెబ్సైట్లోనే లేదని, కేశవపూర్‌లో దళితులు ఎక్కువగా ఉన్నారు.. మూడెకరాల భూమి, ఉద్యోగాలు, లక్ష రుణమాఫీ చేశారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘కేసీఆర్ దమ్ముంటే రా.. రేపటి వరకు ఇక్కడే ఉంటా.. నేను మాట్లాడింది తప్పు అని నిరూపిస్తే నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తా’అని సవాల్ విసిరారు.
గత ఏడాది వరద సాయం కోసం రూ.600 కోట్లు విడుదల చేసి అందులో రూ.300 కోట్లు నొక్కేశారని రేవంత్ ఆరోపించారు. వరదల్లో 6 లక్షల కుటుంబాలకు రూ.10 వేలు ఇస్తానని మోసం చేసిన కేసీఆర్.. 30 లక్షల దళిత కుటుంబాలకు 10 లక్షలు ఇస్తాడంటే నమ్ముదామా అని రేవంత్ ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం అయితే ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. పెన్షన్లు ఎందుకు రెండు నెలలకు ఒకసారి ఇస్తున్నారని నిలదీశారు. హుజురాబాద్ దళిత కుటుంబాల కాళ్లకు మొక్కి అడుగుతున్నానని… మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత, గిరిజన కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. రూ.10 లక్షలను కేసీఆర్ ఇంట్లో నుంచి ఇవ్వడం లేదని.. కానీ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే విషయంలో ఆలోచించాలని రేవంత్ కోరారు.
‘గజ్వేల్‌కు ఎట్లా వస్తావో.. చూస్తా అంటున్నావు కదా.. వచ్చే నెలలో వస్తా.. దమ్ముంటే ఆపుకో.. గజ్వేల్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తా.. నీ దొడ్లో ఉన్న కుక్కలను మొరగవద్దని చెప్పు.. అడ్డం వచ్చే కొడుకులను తొక్కుకుంటూ గజ్వేల్‌లో అడుగు పెట్టకపోతే గుండు కొట్టించుకుంటా.. లఫుట్ గాళ్ళు మాట్లాడటం కాదు.. దమ్ముంటే వచ్చే నెలలో గజ్వేల్‌కు రండి చూసుకుందాం. రాష్ట్ర భవిష్యత్ హుజురాబాద్ ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఉంది. ఈటెల మీద వేసిన విచారణ ఏమైంది? ఈటెల అక్రమాలపై వేసిన ఐఏఎస్‌ల కమిటీ నివేదిక ఎప్పుడు వస్తుంది? ఈటెల రాజేందర్ బీజేపీలో చేరగానే దొంగలు.. దొంగలు ఒక్కటైయ్యారు’ అని రేవంత్ ఆరోపించారు.
ఈ వార్త కూడా చదవండి: జగన్‌ను ఫాలో అవుతున్న షర్మిల