Friday, November 22, 2024

రోశయ్యకి స్మృతి వనాన్ని నిర్మించాలి: ప్రభుత్వానికి రేవంత్ విజ్ఞప్తి

మాజీ సీఎం రోశయ్య మృతిపై టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగి, అత్యంత క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారని అన్నారు. రోశయ్య 52 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీతో పాటు దేశ రాజకీయాలకు గొప్ప సేవలను అందించారని తెలిపారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా తాను కలిశానని, ప్రస్తుత రాజకీయాలపై సుధీర్ఘ చర్చించామని తెలిపారు. పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లేందుకు అనేక సలహాలను, సూచలను చేశారని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో 15 సార్లు రాష్ట్ర బడ్జెట్ నీ ప్రవేశపెట్టి, శాసన సభ, మండలి, ముఖ్యమంత్రి, గవర్నర్ గా పదవులు చేపట్టిన గొప్ప రాజకీయ నాయకుడని రేవంత్ కొనియాడారు. చేపట్టిన ప్రతి పదవికి వన్నె తీసుకు వచ్చారన్నారు.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. విషయం తెలిసిన వెంటనే తాను సోనియా, రాహుల్ గాంధీలకు సమాచారం అందించానన్నారు. వారు రోశయ్య కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారని వివరించారు. ఆదివారం 11 గంటలకు గాంధీ భవన్ లో ఆయన పార్థివ దేహాన్ని అభిమానుల కోసం ఉంచనున్నామని చెప్పారు. ఆయన చివరి చూపుకు అభిమానులు తరలి రావాలని కోరారు.

2004లో మొదటి సారి తాను శాసన సభకి వెళ్లి ప్రసంగించినప్పుడు పెద్దాయన తనను పిలిచి, లైబ్రరీకి వెళ్లి ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా మాట్లాడినప్పటికి, తనను పిలిచి సూచనలు ఇచ్చారన్నారు. ఇంకా జ్ఞానాన్ని సంపాదించి చట్ట సభల్లో వివరించాలని చెప్పారని అన్నారు. పిసిసి అధ్యక్షుడుగా తాను నియమకం అయ్యాక.. ఆయనను కలిసినప్పుడు ఆయన అనుభవంతో అనేక సూచనలు చేశారన్నారు. హోదాలు అలంకార ప్రయాలు కాదు, ప్రజలకు సేవ చేసే అవకాశాలు అని చెప్పిన గొప్ప వ్యక్తి రోశయ్య అని కొనియాడారు. రాజకీయ కురువృద్ధుడుగా గొప్ప సేవలను అందించిన రోశయ్య మరణం రాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటన్నారు.

హైదరాబాద్ లో స్థలాన్ని కేటాయించి, రోశయ్యకి స్మృతి వనాన్ని నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. రోశయ్య అందరితో స్నేహ స్వభావ శీలి వైఖరి ఉన్న వ్యక్తి అని అన్నారు. నారాయణపేట – కొడంగల్ నియోజక వర్గానికి నీళ్ళు తీసుకు రావటానికి పునాది వేసింది రోశయ్య సీఎంగా ఉన్నప్పుడేనని చెప్పారు. తాను కొడంగల్ లో చేసిన అభివృధి అధిక భాగం రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు చేసిందేనని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement