ప్రధాని మోదీపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం గాంధీ భవన్ ప్రకాశం హాల్‌లో రాజీవ్ స్మారక కమిటీ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరు మార్చడంపై మండిపడ్డారు. ‘‘రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును ఎందుకు మార్చారంటే.. రాజీవ్ గాంధీ ఏమైనా క్రీడాకారుడా? అని బీజేపీ వాళ్లు మాట్లాడుతున్నారు. గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం పేరును మోదీ స్టేడియంగా ఎందుకు మార్చారు? మోదీ ఏమైనా క్రీడాకారుడా?’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
దేశ నిర్మాణంలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాజీవ్ ఎంతగానో తాపత్రయపడ్డారని ఆయన పేర్కొన్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్‌దేనని అన్నారు. అంతేకాదు, తన క్యాబినెట్‌లో 40శాతం యువతకు అవకాశం కల్పించి ప్రోత్సహించారని గుర్తు చేశారు. క్రీడలను ప్రోత్సహించేందుకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డును కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తే.. అందులో రాజీవ్ పేరును తొలగించడం ఎంత వరకు సమంజసమని రేవంత్ నిలదీశారు.
ఇది కూడా చదవండిః తెలంగాణలో కాంగ్రెస్ కు 72 సీట్లు పక్కా!