రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళన చేపట్టింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెట్రోల్ బంకుల వద్ద నిరసనలు తెలుపుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. ఘట్‌కేసర్‌లో ఎంపీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నిరసన తెలుపుతోంది. హైదరాబాద్-వరంగల్ రహదారి పక్కన ఉన్న పెట్రోలు బంకు వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ధరలు పెంచుతూ ఆదాయ వనరుగా మార్చుకున్నాయని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిత్యం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ నిరుపేద ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. పెట్రో రేట్లు పెంచుతూ పేదలను నిలువు దోపిడి చేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా సంక్షోభంతో ఏడాది నుంచి లక్షలాది మంది ఉపాధి కోల్పోయారన్న రేవంత్.. 10 నెలల కాలంలో పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ. 26 పెంచారని చెప్పారు. కరోనా సంక్షోభంలో పేదలను ఆదుకోవాల్సింది పోయి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో మోడీ, గల్లీలో కేడీ ఇద్దరు కలిసి లీటర్ 35 రూపాయలకు రావాల్సిన పెట్రోల్ వంద రూపాయలకు అమ్ముతున్నారని విమర్శించారు. ఇందులో రూ.33 మోడీ, రూ.32 కేసీఆర్ పన్నుల పేరిట వసూలు చేస్తున్నారని రేవంత్ అన్నారు. పెట్రోల్,డీజిల్ ధర పెరిగితే ఆ ప్రభావం రవాణా రంగంపై ఉంటుందన్నారు. మోడీ ఏడేళ్ల పాలనలో అచ్చేదిన్ రాలేదు… సచ్చేదిన్ వచ్చిందన్నారు. పెట్రో ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయని ఎంపీ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కెప్టెన్ ధవన్: శ్రీలంక టూర్‌కు భారత జట్టు ఎంపిక..